Share News

నోటికి తాళం... నోటుకు గాలం..!

ABN , Publish Date - May 12 , 2024 | 12:09 AM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 43 మంది, మల్కాజిగిరి నుంచి 22మంది అభ్యర్థులు బరిలో దిగారు.

నోటికి తాళం... నోటుకు గాలం..!

నిలిచిన ప్రసంగాలు, ఆగిన ప్రచార రథాలు

23రోజుల పాటు హోరెత్తిన ప్రచారం

చివరి రోజు పోటా పోటీగా కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతల సభలు

రంగారెడ్డి అర్బన్‌, మే 11 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 43 మంది, మల్కాజిగిరి నుంచి 22మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నెల రోజులుగా ప్రచారం హోరెత్తించారు. ప్రచారంలో ఆఖరు రోజు విరామం లేకుండా ప్రచారాన్ని కొనసాగించారు. పోలింగ్‌కు సమయం సమీపించడంతో ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వాయిస్‌ కాల్స్‌తో పాటు ఓటర్ల ఫోన్లు హోరెత్తించారు.

ప్రలోభాలకు ఎర

ప్రచారానికి తెర పడటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అస్ర్తాలను ప్రయొగిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 29,38,370 ఓటర్లున్నారు. వీరిలో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 7,58,102మంది ఉన్నారు. వీరంతా ఏ పార్టీకి వేయబోతున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. మల్కాజిగిరి పారమెంట్‌ నియోజవర్గంలో 37,79,596 ఓటర్లున్నారు. అత్యధిక మంది ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నగదు, కానుకల రూపంలో ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఓటుకు రూ. 500 పంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగదు పంపిణీ చేసే అవకాశాలున్నాయి.

నేతలకు ప్రతిష్టాత్మకమే..

తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గాల్లో మెజార్టీ కోసం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ అభ్యర్థి విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గ్రామాల వారీగా తమ బలాబలాలపై సమీక్షిస్తూ తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.

అగ్రనేతల ప్రచారం..

లోక్‌సభ ఎన్నికల ప్రచారం పర్వం ముగింపులో భాగంగా చివరి రోజు ప్రధాన పార్టీల అగ్రనేతలు పశ్చిమ రంగారెడ్డిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వికారాబాద్‌ సభలో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరపున ప్రచారం చేశారు. అలాగే తాండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ సభలో ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వారు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి తరపున ప్రచారాన్ని హోరెత్తించారు. మల్కాజిగిరి స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 12:22 AM