Share News

సంయుక్త సర్వే చేయాల్సిందే!

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:34 AM

పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల కలిగే ముంపుపై సంయుక్త సర్వే చేయాల్సిందేనని తెలంగాణ స్పష్టం చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీకి చెందిన కృష్ణా గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ (కేజీబీవో)లో పోలవరం

సంయుక్త సర్వే చేయాల్సిందే!

పోలవరం ముంపుపై తెలంగాణ...కమిటీ ఏర్పాటుకు ఏపీ ఓకే

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల కలిగే ముంపుపై సంయుక్త సర్వే చేయాల్సిందేనని తెలంగాణ స్పష్టం చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీకి చెందిన కృష్ణా గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ (కేజీబీవో)లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశం శివనందన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. దీనికి ఏపీ నుంచి శశిభూషణ్‌కుమార్‌, సి.నారాయణరెడ్డి; తెలంగాణ నుంచి మోహన్‌కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి, సుబ్రమణ్యప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల కలిగే ముంపుపై సంయుక్త సర్వే చేపట్టాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)తో పాటు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరంతో ముంపు ఉంటుందని తేలిందని, వర్షాకాలంలోపు సంయుక్త సర్వే చేపట్టి, ముంపునకు గురయ్యే ప్రాంతాల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై తొలుత అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ, చివరికి అంగీకారం తెలిపింది. సంయుక్త సర్వే లాంఛనాలను పూర్తిచేయడానికి త్రిసభ్య కమిటీ (తెలంగాణ, ఏపీ, పీపీఏలకు చెందిన సీఈలు) ఏర్పాటుకు అంగీకరించింది. ఇక పీపీఏ కార్యాలయం రాజమహేంద్రవరానికి తరలించడానికి సమ్మతి తెలుపుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఇచ్చిన లేఖను తెలంగాణ ప్రతినిధులు అందించారు. పీపీఏ క్యాంపు కార్యాలయం మాత్రం హైదరాబాద్‌లోనే ఉండనుంది. పోలవరం ప్రాజెక్టు గెజిట్‌ ప్రకారం పీపీఏలో తమ అధికారులను నియమించాలని తెలంగాణ కోరింది.

Updated Date - Jan 30 , 2024 | 10:27 AM