Share News

తిహాడ్‌లో ఇంటి భోజనమే!

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:00 AM

తిహాడ్‌లోనూ కవిత ఇంటి భోజనమే చేయనున్నారు. జైలులో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించే ఉంటారు. తనకు నచ్చిన మంచం, పరుపు.. ఇలా కొన్ని ప్రత్యేక వసతుల మధ్య జీవించనున్నారు. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన తర్వాత తనకు జైలులో కొన్ని వసతులు కల్పించాలని

తిహాడ్‌లో ఇంటి భోజనమే!

జైలులో కవితకు ప్రత్యేక వసతులు

కుమారుడి పరీక్షలకు బెయిలడిగిన కవిత

ఏప్రిల్‌ 1 వరకు ఈడీకి గడువిచ్చిన కోర్టు

న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తిహాడ్‌లోనూ కవిత ఇంటి భోజనమే చేయనున్నారు. జైలులో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించే ఉంటారు. తనకు నచ్చిన మంచం, పరుపు.. ఇలా కొన్ని ప్రత్యేక వసతుల మధ్య జీవించనున్నారు. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన తర్వాత తనకు జైలులో కొన్ని వసతులు కల్పించాలని న్యాయస్థానానికి కవిత విజ్ఞప్తి చేశారు. ఇంటి భోజనం, మంచం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్‌ షీట్‌, దుప్పటి, పుస్తకాలు, పెన్నులు, రాసుకోవడానికి కాగితాలు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లడానికి అనుమతి కావాలని కోరారు. అన్ని రకాల విజ్ఞప్తులకు న్యాయమూర్తి కావేరి బవేజా అంగీకరించారు. ఇంటి భోజనం చేయడానికి, జైలులోనూ ఆభరణాలు ధరించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే కవిత నిద్రపోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, దుస్తులు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. వీటితో పాటు పెన్ను, తెల్ల కాగితాలు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరఫున న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్టు చెప్పగా, ఆ తర్వాత కొద్దిేసపటికే కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక సెల్‌ లోకి తీసుకెళ్లారు. సుమారు మూడు గంటలు ఆ సెల్‌లోనే ఉంచారు. ఆ సమయంలో కవిత బయటికి వేస్త కలిేసందుకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఉండగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. వారిని ఆ సెల్‌ నుంచి దూరంగా పంపించివేశారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జైలు వాహనాన్నే ఆ సెల్‌ లోపలికి వెళ్లనిచ్చారు. కవితను సెల్‌ లోపలే వాహనంలోకి ఎక్కించుకుని తిహాడ్‌ జైలుకు తీసుకెళ్లారు. సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కవిత జైలుకు చేరుకున్నారు. అక్కడ జైలు అధికారులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది. కవిత కోసం తిహాడ్‌ జైలులో ప్రత్యేక గదిని కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఏప్రిల్‌ 1లోపు అభ్యంతరాలు తెలపండి

కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆమె తరఫున న్యాయవాది కోర్టును కోరారు. కవిత రెండో కుమారుడు మైనర్‌ అని, అతనిని సంరక్షించాల్సిన బాధ్యత తల్లిపై ఉందని న్యాయమూర్తికి తెలిపారు. అందుకే, కవితకు బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 11వ తరగతి ఫైనల్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయని, మంగళవారం పరీక్షలు మొదలయ్యాయని, ఏప్రిల్‌ 16 వరకు ఉన్నాయని ప్రస్తావించారు. బెయిలు విజ్ఞప్తికి ఈడీ తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. నల్లధనం చెలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) 45(1)(బీ)(ఐ) నిబంధన ప్రకారం నిందితులు బెయిల్‌ కోసం దరఖాస్తు చేస్తే కౌంటర్‌ వేయడానికి వారం రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అభ్యంతరాలు ఉంటే ఆ తేదీలోపే కోర్టుకు నివేదించాలని ఈడీని ఆదేశించారు. మద్యం కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను నిర్ధారించారు.

Updated Date - Mar 27 , 2024 | 08:01 AM