Share News

చెరువుకు చేరని చేప!

ABN , Publish Date - Aug 11 , 2024 | 11:40 PM

అసలే అరకొర వర్షాలు. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రమే నీళ్లు. అయినా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. నేటికీ జిల్లాలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదును దాటుతున్నా చెరువుల్లో చేప పిల్లలను వేయకపోవడంతో ఆలస్యమవు తున్నా కొద్దీ చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పంపిణీ ప్రక్రియ చేపట్టాలని గంగపుత్రులు కోరుతున్నారు. అలాగే ఉచితంగా కొర్రమట్ట పిల్లలను సైతం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 186 మత్స్య సహకార సంఘాల్లో 9,136 మంది సభ్యులు ఉన్నారు.

చెరువుకు చేరని చేప!

అదును దాటుతున్నా చేపపిల్లల పంపిణీ కరువు

ఆలస్యంతో ఎదుగుదలపై తీవ్ర ప్రభావం

జిల్లాలో నేటికీ పూర్తికాని టెండర్ల ప్రక్రియ

బిల్లుల అందక వెనకడుగు వేస్తున్న కాంట్రాక్టర్లు

ఈ ఏడాది 1.93 కోట్ల పిల్లల పంపిణీకి ప్రతిపాదన

త్వరగా పంపిణీ చేయాలంటున్న మత్స్యకారులు

ఆందోళనలో గంగపుత్ర కుటుంబాలు

అసలే అరకొర వర్షాలు. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రమే నీళ్లు. అయినా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. నేటికీ జిల్లాలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదును దాటుతున్నా చెరువుల్లో చేప పిల్లలను వేయకపోవడంతో ఆలస్యమవు తున్నా కొద్దీ చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పంపిణీ ప్రక్రియ చేపట్టాలని గంగపుత్రులు కోరుతున్నారు. అలాగే ఉచితంగా కొర్రమట్ట పిల్లలను సైతం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 186 మత్స్య సహకార సంఘాల్లో 9,136 మంది సభ్యులు ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 11): సీజన్‌ దాటిపోతున్నా చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. చెరువు, కుంటల్లోని ఉన్న నీరు కూడా ఇంకిపోతుండటంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. టెండర్లకు కాంట్రాక్టర్లను ఇప్పటికే రెండు సార్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకురాక పోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదికి సంబంధించిన గుత్తేదార్లకు చెల్లించాల్సిన బిల్లులు ఇంకా పెడింగ్‌లో ఉండటంతో ఈసారి టెండర్‌ వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. మళ్లీ వారు టెండర్లలలో పాల్గొనాలంటే టెండర్‌ ఫీజు, ఈఎండీ, చేపపిల్లల కొనుగోలు, రవాణా తదితర వాటికి పెట్టుబడి అవసరం. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో వారు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా, రేపు(13వ తేదీ) మరోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 813 చెరువుల్లో 1.93 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రతిపాదనలు పంపారు.

కనీసం ఆరు నెలల సమయం..

పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45 రోజుల వయసున్న 35 - 40 మి.మీ పొడవు చేప పిల్లలు, ఏడాది మొత్తం నీరు ఉండే పెద్ద చెరువుల్లో 75 రోజుల వయస్సున్న 80-100 మి.మీ పిల్లలను వదులుతారు. నీటిలో వదిలిన తర్వాత కిలో సైజులో చేప పెరగాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. జూన్‌, జూలైలో వదిలితేనే డిసెంబర్‌ నెల నుంచి రెండు, మూడు నెలల పాటు వాటిని పట్టి విక్రయించవచ్చు. ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సెప్టెంబరులో వదిలితే కిలో సైజుకు పెరగాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇంకా పెరగాలంటే వేసవి వస్తుంది. ఎండ కారణంగా ఆ చేపలు నీటిలోనే చనిపోయే ప్రమాదముందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్‌ లేని రకాలే దిక్కు

జిల్లాలో ఏటా సుమారు 1.62 కోట్ల ఉచిత చేప విత్తనాలను మత్స్యశాఖ పంపిణీ చేస్తుంది. అయితే డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కొర్రమీను లాంటివి కాకుండా బొచ్చ, రవ్వు చేప పిల్లలను మాత్రమే చెరువులు, కుంటల్లోకి వదులుతుది. ధర ఎక్కువ కావడంతో జాతి చేప పిల్లలను కొనుగోలు చేయలేమంటూ మత్స్యశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా కొర్రమట్ట పిల్లలను పంపిణీ చేయాలని గంగపుత్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతీ ఏటా ఆలస్యంగానే..

గతేడాది (2023-24) సెప్టెంబరులో రూ.1.33 కోట్లతో 1.96 కోట్లు చేప విత్తనాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, 114.60 లక్షల ఖర్చు పెట్టి 162.35 లక్షల చేపపిల్లలను 868 చెరువుల్లో వదిలారు. కాగా, ఏటా టెండర్‌ విధానంపై కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించడంతో పంపిణీ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. జూలైలో విత్తన పంపిణీ చేయాల్సి ఉండగా మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభమవుతోంది. దీంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గి, చేపలు పెరిగే అవకాశం తగ్గిపోతుంది. ఈ ఏడాది 813 చెరువుల్లో 1.93 కోట్ల చేప విత్తనాలు వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలాఖరు వరకు చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నిధుల పక్కదారిపై అనుమానాలు

మత్స్యశాఖ అందించే చేపలను ఆంధ్రప్రదేశ్‌ నుంచి టెండర్‌ ద్వారా కొనుగోలు చేసి తీసుకొస్తున్నది. చెరువుల్లో చేప పిల్లలను వదలకుండానే లెక్కల్లో మాత్రం పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చేప విత్తనాల పంపిణీలో పెద్దఎత్తున నిధులు దారి మళ్లుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ జిల్లా అధికారి సుకీర్తి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాకు ఇన్‌చార్జి అధికారిని నియమించారు.

మొత్తం 186 సహకార సంఘాలు

జిల్లాలో 186 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. వీటిలో 18 మహిళా సంఘాలు ఉన్నాయి. మార్కెటింగ్‌ సహకార సంస్థలు 6, అన్నింటిలో కలిపి మొత్తం 9,136 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో మొదటి విడతగా ఇప్పటి వరకు 48 నూతన మత్స్య పారిశ్రామిక సంఘాల ఏర్పాటు చేశారు. అలాగే రెండో విడతలో 20 సంఘాలను వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించి ఏర్పాటు చేశారు.

------------

కొనుగోలు హక్కును సొసైటీలకు ఇవ్వాలి

అదును దాటాక చేప పిల్లలు ఇస్తే ఏం లాభం. ప్రభుత్వం ఇచ్చే సీడ్‌ కూడా నాసిరకంగా ఉంటుంది. పంపిణీ చేసే చేప విత్తనాల లెక్కల్లో భారీ తేడా ఉంటుంది. క్షేత్రస్థాయిలోకి పిల్లలు చేరకుండానే నిధులు స్వాహా అవుతున్నాయి. ప్రభుత్వం నేరుగా సొసైటీలకు అవకాశం కల్పిస్తే, అవసరమైన చేపలను పెంచుకునే వీలుంటుంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఏటా మూడు నెలలు ఆలస్యంగా చేప విత్తనాలు అందుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం, రావిర్యాల చెరువులో వేసిన రొయ్య విత్తనాలు కల్తీ వచ్చాయి.

-గోరెంకల నర్సింహ, మత్య్స సహకార సంఘం జిల్లా చీఫ్‌ ప్రమోటర్‌

త్వరగా పంపిణీ చేయాలి

త్వరగా చేప పిల్లలను పంపిణీ చేయాలి. సీజన్‌ దాటి పోయాక ఇస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు సీడ్‌ చెరువుల్లో వేస్తే చేపలు పెరగవు. చేప పిల్లల పంపిణీకి బదులుగా మత్య్స సహకార సంఘాలకు నగదను బదిలీ చేయాలి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కొర్రమీను పిల్లలను పంపిణీ చేస్తే మాకు మరింత లాభసాటిగా ఉంటుంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఏటా మూడు నెలలు ఆలస్యంగా చేప విత్తనాలు అందుతున్నాయి.

-తవిటి యాదగిరి, ఆరుట్ల మత్య్స సొసైటీ అధ్యక్షుడు

813 చెరువుల్లో పంపిణీకి ఏర్పాట్లు

మత్స్యశాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాల సభ్యులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 813 చెరువుల్లో 1.93 కోట్లు చేప పిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 13న చేపపిల్లల టెండర్ల కోసం మరోసారి గుత్తేదారులను ఆహ్వానిస్తున్నాం. టెండరు పూర్తి కాగానే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.

-నర్సింహారావు, ఇన్‌చార్జి జిల్లా అధికారి

Updated Date - Aug 11 , 2024 | 11:57 PM