Share News

వైద్యశాఖలో కొలువుల జాతర

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:01 AM

వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర మొదలైంది. ఆయా విభాగాధిపతుల పరిధిలో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది.

వైద్యశాఖలో కొలువుల జాతర

5,348 పోస్టులకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

డీఎంఈ పరిధిలోనే 3,235, టీవీవీపీలో

1,255, డీహెచ్‌లో 575 పోస్టులు

మొత్తం కొలువుల్లో 1,989 నర్స్‌పోస్టులు

లోక్‌సభ ఎన్నికల కోడ్‌కు ముందే జీవో

మెడికల్‌ బోర్డు ద్వారా నియామకం

జూన్‌లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం?

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర మొదలైంది. ఆయా విభాగాధిపతుల పరిధిలో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఈ నెల 16న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులన్నింటిని మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలని జీవోలో పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌కు ముందే ఈ జీవో జారీ చేయగా.. నాలుగు రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది. వైద్యవిద్య కళాశాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సర్కారు మంజూరు చేసిన పోస్టుల్లో 60 శాతం వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. ఒక్క డీఎంఈ పరిధిలో 3,235 పోస్టులుండగా, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో 1,255 (టీవీవీపీ), ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్‌) పరిఽధిలో మరో 575 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ప్రస్తుతం కొత్త మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీల నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఈ నెల 16నే వచ్చింది. కోడ్‌కు కొద్ది గంటల ముందు సర్కారు ఈ పోస్టుల భర్తీకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతనే ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. జూన్‌లో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి ఇన్ని పోస్టులకు అనుమతినివ్వడం ఇదే తొలిసారి.

మొత్తం పోస్టుల్లో 1,989 నర్స్‌ పోస్టులు..

మొత్తం పోస్టుల్లో నర్స్‌ పోస్టులే 1,989 ఉన్నాయి. ఇందులో వైద్యవిద్య సంచాలకుల పరిధిలో 1,545 ఉండగా, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో 332, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో 80, ప్రజారోగ్య సంచాలకులు పరిధిలో 31, నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో ఒక పోస్టు ఉన్నాయి. కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన తర్వాత నర్స్‌ పోస్టుల భర్తీపై ఎక్కువ దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఇచ్చిన 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నోటిఫికేషన్‌కు అదనంగా మరికొన్ని పోస్టులను కలిపింది. మొత్తం 6,956 నర్సింగ్‌ ఆఫీసర్స్‌ను మెడిక్‌ కాలేజీల కోసం రిక్రూట్‌ చేసింది. తాజాగా మరో 1,989 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వెరసీ ఒక్క నర్స్‌ పోస్టులే 8,945 అయ్యాయి.

Updated Date - Mar 21 , 2024 | 05:01 AM