Share News

బతికే ఉన్నా డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించారు!

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:57 AM

తాను చనిపోయినట్లు అయినవాళ్లే డెత్‌ సర్టిఫికెట్‌ తీశారని, తాను బతికే ఉన్నానంటూ ఓ మహిళ ‘ప్రజావాణి’ని ఆశ్రయించింది.

బతికే ఉన్నా డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించారు!

ఆస్తి దక్కకూడదని అయినవారి నిర్వాకం

న్యాయం కోసం ప్రజావాణికి మహిళ

కౌలుకు తీసుకొని 6 ఎకరాలు కబ్జా

80 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన

మొత్తంగా 1428 దరఖాస్తులు

బేగంపేట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తాను చనిపోయినట్లు అయినవాళ్లే డెత్‌ సర్టిఫికెట్‌ తీశారని, తాను బతికే ఉన్నానంటూ ఓ మహిళ ‘ప్రజావాణి’ని ఆశ్రయించింది. బాధితురాలు అసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం బట్టుపల్లికి చెందిన ఆరెపల్లి పద్మ. బాధితురాలి వివరాల ప్రకారం.. బొగ్గుగనిలో పని చేసే అరెపల్లి చంటి ఈమెకు పెదనాన్న. తన సోదరుడి కుమార్తె అయిన పద్మను చంటి దత్తత తీసుకొని పెంచుకున్నాడు. భార్య చనిపోవడంతో చంటి రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత చంటి చనిపోవడంతో ఆస్తిపై కన్నేసిన ఆయన రెండోభార్య (పద్మ పిన్ని) అధికారులతో కుమ్మక్కై పద్మ చనిపోయినట్లుగా డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకుంది. దీనిపై బాధితురాలు స్థానిక అధికారులను కలిసినా స్పందన లేకపోవడంతో న్యాయం కోసం పద్మ శుక్రవారం ప్రజాభవన్‌లోని ప్రజావాణికి వచ్చింది. కాగా శుక్రవారం ప్రజావాణికి 1428 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రెవెన్యూపరమైన సమస్యలపై 350, రేషన్‌కార్డుల కోసం 114, ఇందిరమ్మ ఇళ్ల కోసం 397 దరఖాస్తులున్నాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌.. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలసుసుకున్నారు. కాగా డీఎస్సీ-2012లో మొదటి జాబితాలో ఎంపికైనా సవరణల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్‌ అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ సదరు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ప్రజావాణికొచ్చారు. ఇక 61 ఏళ్లు పైబడిన 3797 మంది వీఆర్‌ఏలు.. తమ వారసులకు నియామక పత్రాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రజావాణికొచ్చి విజ్ఞప్తి చేశారు. వారితో చిన్నారెడ్డి, దివ్య దేవరాజ్‌ మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని వారికి హామి ఇచ్చారు. తన ఆరు ఎకరాల భూమిని కౌలుకు సాగుచేసే వారే కబ్జా చేశారంటూ భూపాలపల్లి మండలం ఆదంనగర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యను చెప్పేవరకు ఇక్కడ నుంచి వెళ్లనని ఆమె భీష్మిచడంతో పోలీసులు అమెకు నచ్చచెప్పి అక్కడ నుంచి పంపించారు.

Updated Date - Mar 16 , 2024 | 07:33 AM