Share News

శ్రీవేంకటేశ్వర రైస్‌మిల్లుపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:09 AM

: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కొమరబండ శ్రీవేంకటేశ్వర పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లు యజమాని నీలా సత్యనారాయణపై కేసు నమోదైంది.

శ్రీవేంకటేశ్వర రైస్‌మిల్లుపై కేసు నమోదు

కోదాడ రూరల్‌, ఏప్రిల్‌ 18: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కొమరబండ శ్రీవేంకటేశ్వర పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లు యజమాని నీలా సత్యనారాయణపై కేసు నమోదైంది. కస్టం మిల్లింగ్‌ కోసం తీసుకున్న ధాన్యాన్ని మూడు సీజన్లుగా బియ్యం ఇవ్వకుండా పెద్దమొత్తంలో ప్రభుత్వానికి బకాయి పడ్డాడు. దీంతో రాష్ట్ర సివిల్‌ సప్లై, విజిలెన్స్‌ అధికారులు మిల్లులో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. మొదట మిల్లు యజమానిని అదుపులోకి తీసుకొని విచారించాలని అధికారులు భావించినా మిల్లు యజమాని పరారీలో ఉండడంతో అతనిని మిల్లుకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొత్తం మూడు బృందాలుగా వచ్చిన అధికారులు కోదాడలోని అతని ఇల్లు, కళాశాలతో పాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కూడా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో అధికారులు యజమాని లేకపోయినా రాత్రి 12గంటల వరకు సోదాలు నిర్వహించి ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యంలో ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన బియ్యం పోనూ సుమారు రూ.80 కోట్ల మేర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌కు బకాయి పడినట్లు విచారణలో తేలింది. దీంతో మిల్లు యజమాని నీలా సత్యనారాయణపై సూర్యాపేట సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ రాములు కోదాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రైస్‌మిల్లు 2022-23లో ఖరీ్‌ఫలో 23,325 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లుకు కేటాయించింది. 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 7,067టన్నులు మాత్రమే ఇచ్చారు. 8,607టన్నుల బియ్యం బకాయి ఉంది. రబీలో 15,535టన్నుల ధాన్యం కేటాయించగా, 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉం డగా, 200టన్నులు మాత్రమే ఇచ్చాడు. ఇంకా 10,208 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు సీజన్లలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకపోయినా ప్రభుత్వం తిరిగి 2023-24 సంవత్సరం ఖరీ్‌ఫలో 4,102 టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. ఇందుకు 2,748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 261 టన్నులు మాత్రమే ఇచ్చారు. ధాన్యంలో ప్రతి సీజన్‌లో 20శాతం కూడా బియ్యం ఇవ్వలేదని విచారణలో తేల్చారు. ఈ విషయంలో గతంలో ఇక్క డ పనిచేసిన జిల్లాస్థాయి అధికారులు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఓ జిల్లాస్థాయి అధికారికి మిల్లు యజమాని కారు బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. నూతనంగా వచ్చిన ప్రభుత్వం కస్టం మిల్లింగ్‌ కోసం సేకరించిన ధాన్యం మిల్లు యజమానులు కస్టం మిల్లింగ్‌ కోసం తీసుకున్న ధాన్యానికి ఇంతవరకు బిల్లులు ఇవ్వకపోవడంతో మిల్లులో ఉన్న ధాన్యం జప్తు చేసి, ధాన్యం అమ్ముకున్న మిల్లర్ల ఆస్తులు, మిల్లులను జప్తు చేయాలని ఆదేశించింది.

రఘురాం రైస్‌మిల్లులోనూ తనిఖీలు

నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఈటురు రెవెన్యూ శివారులో ప్రగతినగర్‌ సమీపం వద్ద ఉన్న రఘురాం రైస్‌పార్‌బాయిల్డ్‌ మిల్లులో సుర్యాపేట జిల్లాసివిల్‌ సప్లయ్‌ అధికారులు, రెవెన్యూ యంత్రాగం కలిసి ఈ నెల 15వ తేదీన తనిఖీలు చేశారు. సీఎంఆర్‌ రైస్‌ బియ్యం 10లక్షల గన్నీ బ్యాగులకు పైగా సివిల్‌ సప్లయ్‌కి ఇవ్వకుండా మిల్లు యాజమాని ఇమ్మడి సోమ నర్సయ్య బయటకు విక్రయించి డిపాల్టర్‌గా మారడంతో కలెక్టర్‌ ఆదేశాలతో అదనపు కలెక్టర్‌ ప్రియాంక నేతృత్వంలో మిల్లులో సోదాలు నిర్వహించారు. గురువారం మరోసారి సివిల్‌ సప్లయ్‌ అధికారలు మిల్లులో సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకుని మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలు, సీఎంఆర్‌ రైస్‌ లెక్కలు తేల్చేపనిలో ఉన్నారు. రైస్‌మిల్లు యాజమాని ఇమ్మడి సోమనర్సయ్యను సివిల్‌ సప్లయ్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైస్‌మిల్లులో జరిగిన అవకతవకలపై పూర్తి నివేదికను కలెక్టర్‌కు నివేదించనున్నట్లు సివిల్‌ సప్లయ్‌ డీఎం తెలిపారు. తహసీల్దార్‌ బ్రహ్మయ్య సమక్షంలో సివిల్‌ సప్లయ్‌ అధికారులు సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సుర్యాపేట ఆర్డీవో, జిల్లా సివిల్‌సప్లయ్‌ అధికారి, డీఎం సివిల్‌ సప్లయ్‌, ఏడీఎం మార్కెటింగ్‌, జడ్పీసీఈవో, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 07:56 AM