Share News

బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:19 AM

ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
ప్రమాదానికి గురైన బైక్‌

ధారూరు, ఏప్రిల్‌ 29: ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన ధారూరు సమీపంలోని కత్వ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం.. తాండూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధారూరు దాటిన తర్వాత కత్వ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మండలంలోని నర్సాపూర్‌ గ్రామానికి చెందిన కావలి అనందం(35) అక్కడికక్కడే మృతిచెందగా అతడితో పాటు ఉన్న అదే గ్రామానికి చెందిన కావలి సాయికి తీవ్ర గాయాలై ప్రాణపాయస్థితిలో ఉన్నాడు. ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కాగా బస్సు డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా రోడ్డుకు ఎడమ వైపు నుంచి కుడివైపునకు బస్సును నడపించటంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

ఘట్‌కేసర్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.,....ఉప్పల్‌కు చెందిన కొమ్మిడి అమృతరెడ్డి(62) తన భార్య కొమ్మిడి లలితతో కలిసి హోండా యాక్టివాపై ఈ నెల 27 పని నిమిత్తం భువనగిరికి బయలుదేరాడు. ఘట్‌కసర్‌ మండలం, అవుషాపూర్‌ బ్రిడ్జి సమీపంలో యాక్టివా అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో అమృతరెడ్డికి తీవ్రగాయాలు కాగా అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అమృతరెడ్డిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 12:19 AM