Share News

ఆవిశ్వానికి అడ్డు?

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:32 PM

మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డిపై కొనసాగుతున్న అవిశ్వాస తీర్మాన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరక అవిశ్వాసాన్ని దాటవేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఆవిశ్వానికి అడ్డు?

ముందుకు సాగని మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

కాంగ్రెస్‌ పెద్దల మధ్య కుదరని ఏకాభిప్రాయం

పీసీసీ ఆధ్యక్షుడిపై కౌన్సిలర్ల గుర్రు

చైర్‌పర్సన్‌ భర్త నర్సింహారెడ్డి సుధీర్‌రెడ్డిని కలవడంపై అనుమానాలు

మేడ్చల్‌ టౌన్‌. జూన్‌ 9 : మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డిపై కొనసాగుతున్న అవిశ్వాస తీర్మాన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరక అవిశ్వాసాన్ని దాటవేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 23మంది కౌన్సిలర్లలో ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు ఉండగా.. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మరో 13 మంది బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అవిశ్వాసం కోసం మెజారిటీ కౌన్సిలర్ల బలం చేకూరింది. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ మే 18న కాంగ్రె్‌సకు చెందిన 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా నోటీసు ఇచ్చారు. అయినా ఆవిశ్వాసం వాయిదా పడుతుండడంతో స్థానిక పార్టీ పెద్దలే ఈ వ్యవహారానికి అడ్డుతగులుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పార్టీ మారిందే అవిశ్వాసం కోసం..

అవిశ్వాసం వ్యవహారం ఎటూ తేలకపోవటంతో ఇటీవ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పెద్దల తీరు పట్ల గుర్రుమంటున్నారు. పార్టీలో చేరేముందు మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌తో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపి, అవిశ్వాసం కోసం మాటిచ్చిన అనంతరం పార్టీలో చేరామని కొందరు కౌన్సిలర్లు ఖరాకండిగా చెబుతున్నారు. అయితే, ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకుని.. ఎన్నికల అనంతరం తమ గురించి పట్టించుకోవటం లేదని కొందరు నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దల సూచనల మేరకే మే 18న కలెక్టర్‌కు అవిశ్వాసం కోసం 16 మంది కౌన్సిలర్లు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం గురించి పార్టీ పెద్దలను అడిగినా స్పందిచకపోవటంతో కొందరు బడా నాయకులుచైర్‌పర్సన్‌ పదవిని రక్షించేందుకు యత్నిస్తున్నట్లు పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

సుధీర్‌రెడ్డి తీరుపై మండిపడుతున్న కౌన్సిలర్లు

కాగా, అవిశ్వాసానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుఽధీర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ దీపిక భర్త నర్సింహారెడ్డిలు గతంలో తెలుగు దేశం పార్టీలో కలిసి పనిచేశారు. దాంతో సుధీర్‌ రెడ్డి మేడ్చల్‌ చైర్‌పర్సన్‌ను కాపాడుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పార్ల మెంట్‌ ఎన్నికలకు ముందు చైర్‌పర్సన్‌ భర్త నర్సింహారెడ్డి ఇద్దరు కౌన్సిలర్లతో కలిసి కాంగ్రె్‌సలో చేరటానికి సుధీర్‌రెడ్డితో కలవటం స్థానిక కౌన్సిలర్ల అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి కోసం పనిచేసిన చైర్‌పర్సన్‌ను తమ పార్టీ పెద్దలు రక్షించటం కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు.

ఒక్కటైన సామాజిక వర్గం!

మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపకా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఆమె పదవిని రక్షించటానికి కాంగ్రె్‌సలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు బడా నాయకులు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ కారణంగానే ఆమెపై అవిశ్వాస తీర్మాణానికి ఒప్పుకోవటం లేదని కొందరు నేతల అభిప్రాయం. అవిశ్వాసం ప్రక్రియను నిలిపి వేయటానికి సీఎం పేషీ నుంచి కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అవిశ్వాసం కోసం ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నప్పటికీ కలెక్టర్‌ నోటీసు జారీ చేయకపోగా.. కనీసం కౌన్సిలర్లు కలవటానికి సమయం ఇవ్వకపోవటంతో వారు విస్మయం చెందుతున్నారు. ఈ విషయంలో పూర్తి భరోసా ఇచ్చిన నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వజ్రే్‌షయాదవ్‌ కూడా తన రాజకీయ గురువు, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేక చేతులెత్తేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు బాహాటంగానే చెబుతున్నారు.

ద్వారాలు తెరిచిన బీజేపీ

కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు అవిశ్వాసం వ్యవహారాన్ని దాటి వేస్తుండటంతో బీజేపీ పెద్దలు కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు తమ పార్టీలో ముకుమ్మడిగా చేరితే అవిశ్వాసానికి పూర్తి సహకారం అందిస్తామంటూ భరోసా ఇస్తున్నట్లు సమాచారం. తమ పార్టీలోకి కనీసం 15 మంది కౌన్సిలర్లు వచ్చిన వెంటనే అవిశ్వాస ప్రక్రియ ప్రారంభమయ్యేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ కౌన్సిలర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తాము ఇచ్చిన అవిశ్వాసంపై 30 రోజుల్లోపు స్పందించని ఎడల సమావేశమై సరైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం, కాగా, చైర్‌పర్సన్‌ను గద్దె దింపటమే లక్ష్యంగా పెట్టుకున్న నేతలు ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Jun 10 , 2024 | 10:32 PM