Share News

99.86 శాతం పోలింగ్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:35 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం.. 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది ఓటు హక్కును

99.86 శాతం పోలింగ్‌

1439 మందిలో.. 1437 మంది ఓటేశారు..

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం

మహబూబ్‌నగర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం.. 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్‌ శాతం 99.86గా నమోదైంది. 8 పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం సభ్యులు ఓటు వేయగా నాగర్‌కర్నూలు కేంద్రంలో బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారదమ్మ అమెరికాలో ఉండడంతో ఓటేయలేకపోయారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం మంతన్‌గోడ్‌కు చెందిన సుమిత్ర పోలింగ్‌లో పాల్గొనలేదు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు మందకొడిగా సాగింది. గోవా, హైదరాబాద్‌, కర్ణాటక తదితర ప్రాంతాల్లో క్యాంపులకు వెళ్లిన ప్రజాప్రతినిధులు 11 గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రాలకు రావడంతో మధ్యాహ్నం 2 గంటలకల్లా మెజారిటీ పోలింగ్‌ పూర్తయింది. క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా గట్టెక్కుతామని కాంగ్రెస్‌ భావిస్తుంటే, బీఆర్‌ఎస్‌ మాత్రం ఎంత క్రాస్‌ ఓటింగ్‌ అవుతుందోనని ఆందోళన చెందుతోంది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ పోలింగ్‌ జరుగుతుండడంతో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నిక కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. తాయిలాలు, క్యాంపులకు రూ.కోట్లలో వెచ్చించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను అధికారులు మహబూబ్‌నగర్‌లోని కాలేజీకి తరలించారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత బీఆర్‌ఎస్‌ తరఫున రెండున్నర తులాల గోల్డ్‌ కాయిన్స్‌ పంచారని ప్రచారం జరగ్గా కాంగ్రెస్‌ తరఫున బీఆర్‌ఎస్‌ సభ్యులకు కూడా డబ్బులు ముట్టాయని వదంతులు వ్యాపించాయి. గద్వాల పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి, స్థానిక సీఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవి గుగులోత్‌, అన్ని జిల్లాల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తన ఎక్స్‌ అఫీషియో ఓటును కొడంగల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్‌ చేరుకున్న ఆయన ఓటు వేసిన తర్వాత లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో తమ ఎక్స్‌ అఫీషియో ఓటు వేశారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ అనూహ్యంగా షాద్‌నగర్‌లో ఓటు వేశారు.

Updated Date - Mar 29 , 2024 | 06:35 AM