Share News

Flying a Kite Four people were Died : ఎగిరేపతంగం.. తెగే ప్రాణం

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:32 AM

పతంగి ఎగురవేసే ఉత్సాహంలో ఉన్నవారిని ప్రమాదం మింగేసింది. అప్పటివరకు సరదాగా గడిపినవారిని మృత్యువు అమాంతం కబళించింది.

Flying a Kite Four people were Died  : ఎగిరేపతంగం..  తెగే ప్రాణం

రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తుల దుర్మరణం

విద్యుదాఘాతంతో ఇద్దరు.. భవనంపై నుంచి పడి ఇద్దరు..!

4 రోజుల్లో ప్రాణాలు కోల్పోయినవారు 9 మంది

మాంజాతో ఘట్‌కేసర్‌లో వ్యక్తి మెడకు తీవ్ర గాయం

వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఇద్దరు యువకులకు కూడా..

నిషేధించినప్పటికీ విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు

కాకినాడ పందెం కోడి రూ.400కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల్లో రూ.100కోట్ల పైనే..

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పతంగి ఎగురవేసే ఉత్సాహంలో ఉన్నవారిని ప్రమాదం మింగేసింది. అప్పటివరకు సరదాగా గడిపినవారిని మృత్యువు అమాంతం కబళించింది. భవనాలపై నుంచి పడి, విద్యుత్తు షాక్‌ తగిలి చిన్నారులు, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. తెగిపడిన చైనా మాంజాలు మెడకు చుట్టుకుని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు స్తంభం వద్ద ఉన్న పతంగిని ఇనుప చువ్వతో తీయబోయి షాక్‌ కొట్టడంతో హైదరాబాద్‌ మైలార్‌దేవుపల్లి గణేశ్‌నగర్‌కు చెందిన డి.లక్ష్మీవివేక్‌ (10) మంగళవారం దుర్మరణం చెందాడు. ఇంటి మీద తీగలపై ఉన్న గాలిపటాన్ని తీస్తూ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లిలో శివకుమార్‌ (22) మృత్యువాత పడ్డాడు. యాప్రాల్‌లో బాలుడు (10), రహ్మత్‌నగర్‌లో కపిల్‌దేవ్‌ చౌహాన్‌ (23) గాలి పటాలు ఎగురవేస్తూ భవనాల మీద నుంచి పడి మృతి చెందారు. కపిల్‌దేవ్‌ మిత్రులపై అనుమానం ఉందంటూ అతడి సోదరుడు చౌహాన్‌ శ్రీదేవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చర్లపల్లిలో తెగిపడిన గాలిపటాలను వెదుక్కుంటూ వెళ్లిన ప్రిన్స్‌ (8) సోమవారం అదృశ్యమయ్యాడు. అతడి మృతదేహం ముళ్లపొదల మధ్యన మంగళవారం లభ్యమైంది. కాగా, పతంగులు ఎగురవేస్తూ ఈ నెల 13న అత్తాపూర్‌లో తనిష్క్‌ (11) విద్యుదాఘాతానికి గురై, పేట్‌ బషీరాబాద్‌లో ఏఎస్సై కుమారుడు (20) భవనం పైనుంచి పడి చనిపోయారు. నాగోల్‌లో బాలుడు (13) మరో బిల్డింగ్‌ మీదకు దూకే క్రమంలో కిందపడి మృతి చెందాడు. హైదరాబాద్‌లో నాలుగు రోజుల్లో ఏడుగురు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పండుగ ముందు రోజు లంగర్‌హౌజ్‌ ఫ్లై ఓవర్‌పై చైనా మాంజా మెడకు తగిలి యువ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

మాంజాతో వాహనదారులకు తీవ్రగాయాలు

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ దత్తాత్రేయ కాలనీ వాసి బుచ్చిరెడ్డి (50) సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా మెడ కు తగిలింది. వాహనాన్ని నిలిపి చూసుకునే సరికి టీషర్టు కాలర్‌ తెగి మెడ అర అంగుళం లోతుకు కోసుకుపోయింది. ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవే టు అస్పత్రికి తరలించారు. వికారాబాద్‌ జిల్లా బూర్గుపల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప వాహనంపై ఎన్కెపల్లి నుంచి వికారాబాద్‌ వైపు వస్తుండగా రైల్వే వంతెనపై చైనా మాంజా తగిలి కంటి కింద కోసుకుపోయింది. మెదక్‌ జిల్లా నిజాంపేటకుచెందిన మహేందర్‌ బైక్‌పై రామాయంపేట వెళ్తుండగా చైనా మాంజా గొంతుకోసింది. హైదరాబాద్‌ రాంనగర్‌లో మేడపై పతంగి ఎగురువేస్తుండగా.. చైనా మాంజా మెడకు తగిలి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిషేధిత చైనా మాంజాను విక్రయించొద్దని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ ఉన్నతాధికారులు హెచ్చరించినా వ్యాపారులు పెడచెవిన పెట్టారు. రోడ్డుమీదనే విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో సంబురంగా సంక్రాంతి

ఇళ్ల ముంగిట రంగు రంగుల ముగ్గులు.. అందులో గొబ్బెమ్మలు.. డూడూ బసవన్నల ఆటలు.. నింగిలో రివ్వున ఎగిరిన పతంగులు.. నోరూరించే వంటకాలతో సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కనుమ సందర్భంగా గారెలు, బూరెలతో పాటు మాంసాహారంతో విందు చేసుకున్నారు. కాగా, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 13న మొదలైన అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ సోమవారంతో ముగిసింది.

కోడి పందేల కోసం ఖమ్మం మీదుగా ఏపీకి

ఏపీలోని సరిహద్దు గ్రామాల్లో కోడి పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి సాధారణ వ్యక్తులు మొదలు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పలురంగాల ప్రముఖులు, ఉద్యోగులు భారీఎత్తున తరలడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా ఏపీ వెళ్లే రహదారులు రద్దీగా మారాయి. కాగా, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్‌ వాసులు తిరిగి వచ్చేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. దీంతో ఏపీకి రోజువారీగా తిప్పే 386 సర్వీసులతో పాటు 50 అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 03:41 AM