Share News

9 పేర్లు ఖరారు!

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:58 AM

రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలలో తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

9 పేర్లు ఖరారు!

కాంగ్రెస్‌ అభ్యర్థులుగా వంశీచంద్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్‌,

సురేష్‌ షెట్కార్‌, జీవన్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, నీలం మధు, రఘువీర్‌రెడ్డి!

కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం నేడు తొలి జాబితా విడుదల!

తెలంగాణ సహా పలు రాష్ట్రాలలోని 60 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక

న్యూఢిల్లీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలలో తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌, జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి, మెదక్‌ నుంచి నీలం మధు, నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించినట్లు సమాచారం. మహబూబాబాద్‌ నుంచి మాజీ మంత్రి బలరాంనాయక్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌, ముఖ్యనేతలు జైరాం రమేష్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అధిర్‌ రంజన్‌ చౌదరి, అంబికా సోని, ముకుల్‌ వాస్నిక్‌, టీఎస్‌ సింగ్‌ దేవ్‌తోపాటు సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణతో సహా పది రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాలలో అభ్యర్థులను నిర్ణయించేందుకు ఆయా రాష్ట్రాల నేతలతో కమిటీ విడివిడిగా సమావేశమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీ్‌పతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఛత్తీ్‌సగఢ్‌, హరియాణా, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్‌ రాష్ట్రాలలో 60 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. తొలుత తెలంగాణకు సంబంధించి కమిటీ సమావేశమైంది. రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు అరగంట పాటు సాగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దీప్‌దాస్‌ మున్షీ తదితరులు పాల్గొన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ వర్చువల్‌గా పాల్గొన్నారు. తెలంగాణలోని మొత్తం 17 సీట్లకుగాను తొమ్మిది సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది.

ఖమ్మం, భువనగిరి, నాగర్‌కర్నూల్‌ పెండింగ్‌

ఖమ్మం, భువనగిరి, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై పీటముడి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని టికెట్‌ను ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తన తమ్ముడు ప్రసాద్‌రెడ్డికి ఖమ్మం టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్‌కు టికెట్‌ అడుగుతున్నారు. నాగర్‌ కర్నూల్‌ సీటుకు డిప్యూటీ సీఎం సోదరుడు మల్లు రవి పోటీ పడుతున్నారు. టికెట్‌ కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. రెండు రోజుల కిందట పార్టీ చీఫ్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి టికెట్‌ కోసం విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో కూడా ఆయన భేటీ అయి టికెట్‌పై చర్చించారు. గత ఎన్నికలలో అలంపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాదిగ కోటాలో నాగర్‌కర్నూల్‌ సీటు తనకు కేటాయించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన భార్యకు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇక్కడి నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి, హైదరాబాద్‌ నుంచి మస్కతితో పాటు ఒక ముస్లిం మహిళా అభ్యర్థి, వరంగల్‌ నుంచి దొమ్మాట సాంబయ్య పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి జాబితాలోనే రాహుల్‌!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో ఆ పార్టీ తొలిజాబితా ద్వారా వెల్లడి కానుంది. రాహుల్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది జాబితా ద్వారా తెలుపుతామని సీఈసీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశనంతరం తెలిపారు. త్వరలో తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు.

ఢిల్లీలో సీఎం రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన సీఎం.. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం యమునా బ్లాక్‌లో ఉన్న తన నివాసానికి వెళ్లారు.

Updated Date - Mar 08 , 2024 | 05:00 AM