Share News

జువెనైల్‌ హోమ్‌ నుంచి 8 మంది పరారీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:15 AM

హైదరాబాద్‌లోని ఓ జువెనైల్‌ హోమ్‌(బాల నేరస్థులు పునరావాస కేంద్రం) నుంచి ఒకేసారి ఎనిమిది చిన్నారులు సినీఫక్కీలో పరారయ్యారు. హోమ్‌ ప్రధాన

జువెనైల్‌ హోమ్‌ నుంచి 8 మంది పరారీ

సినీఫక్కీలో తప్పించుకున్న వైనం

హైదరాబాద్‌లోని జువెనైల్‌ హోమ్‌లో ఘటన

గాజులరామారం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఓ జువెనైల్‌ హోమ్‌(బాల నేరస్థులు పునరావాస కేంద్రం) నుంచి ఒకేసారి ఎనిమిది చిన్నారులు సినీఫక్కీలో పరారయ్యారు. హోమ్‌ ప్రధాన గేటు వద్ద అలజడి సృష్టించి లోపల తరగతి గదిలోని కిటికీ ఊచలను వంచి ఏడుగురు పారిపోయారు. మరొకరు హొమ్‌ ప్రధాన గేటు వద్ద నుంచే పరారయ్యాడు. సూరారం పరిధి కైసర్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు ఎదురుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ జువెనైల్‌ హోమ్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సూరారం పోలీసుల కథనం ప్రకారం.. ఘటన జరిగిన జువెనైల్‌ హోమ్‌లో 32 మంది బాల నేరస్థులు ఉన్నారు. మంగళవారం రాత్రి పాలు తాగే సమయంలో ఇద్దరు బాలలు హోమ్‌ ప్రధాన గేటు వద్దకు వచ్చి పారిపోయేందుకు యత్నించగా విధుల్లో ఉన్న కాపాలాదారుడు అడ్డుకున్నాడు. దీంతో మరికొందరు అక్కడి వచ్చి పాల గ్లాసులు కింద పడేసి గొడవ పడ్డారు. ఈ గొడవ జరుగుతుండగా హోమ్‌లోని ఓ తరగతి గదిలోని కిటికీ ఊచలు వంచి బయటకు వచ్చిన ఏడుగురు బాలలు ప్రహారీ గోడ దూకి పరారయ్యారు. మరోపక్క, హోమ్‌లో గొడవ జరుగుతుండగా ప్రధాన గేటు దగ్గర ఉన్న ఓ బాలుడు వీలు చూసుకుని అక్కడి నుంచే తప్పించుకున్నాడు. ఈ మేరకు జువెనైల్‌ హోమ్‌ సూపరింటెండెంట్‌ సంఘమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తప్పించుకున్న బాలల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 04:15 AM