Share News

789 టీఎంసీలు కేటాయించాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:15 AM

కృష్ణా జలాల్లో తమకు 789 టీఎంసీలను కేటాయించాలని బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరింది.

789 టీఎంసీలు కేటాయించాలి

పాత ప్రాజెక్టులకు 299,

నిర్మాణంలో ఉన్నవాటికి 238

కట్టబోయేవాటికి 216, తాగునీటి అవసరాలకు 36!

కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ స్టేట్‌ ఆఫ్‌ కేస్‌

న్యాయమైన వాటా కింద కేటాయించాలని వినతి

హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తమకు 789 టీఎంసీలను కేటాయించాలని బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. వీటిలో పాత ప్రాజెక్టులకు 299, నిర్మాణంలో ఉన్నవాటికి 238, భవిష్యత్‌లో కట్టేవాటికి 216, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలను కేటాయించాలని నివేదించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచాలని కోరుతూ తెలంగాణ గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై గత ఏడాది అక్టోబరు 6న కేంద్ర జలశక్తి శాఖ విచారణ విధివిధానాలు జారీ చేసింది. దీనిపై బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. జలాలను ఏ విధంగా కేటాయించాలనేదానిపై స్టేట్‌ ఆఫ్‌ కేస్‌ (ఎస్‌వోసీ) దాఖలు చేయడానికి ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణకు గడువిచ్చింది. కాగా, అదే రోజు తెలంగాణ ఎస్‌వోసీ సమర్పించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీ కూడా ఎస్‌వోసీ ఇచ్చేదాకా ఆ రాష్ట్రానికి తమ పత్రాలు అందించొద్దని నివేదించింది. దీనికి ట్రైబ్యునల్‌ అంగీకారం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఎస్‌వోసీలోని వివరాల ప్రకారం.. బేసిన్‌ ప్యారామీటర్‌ ఆధారంగా 68 శాతం క్యాచ్‌మెంట్‌ ఏరియా తెలంగాణలో ఉందని, 2 కోట్ల జనాభా కృష్ణా పరివాహకంలో ఉంటున్నారని, కరువు పీడిత ప్రాంతాలను కలుపుకొని న్యాయమైన వాటాగా 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఙప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం డిపెండబులిటీ (ప్రతి నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద ఆధారంగా నిర్ధారించేది)ని ఆధారం చేసుకుని 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ నివేదించింది.

1,050 టీఎంసీల్లో సగానికి పైగా

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించగా, బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ 194 టీఎంసీలను అదనంగా జత చేసింది. మొత్తంగా 1,005 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి ఉన్నాయి. కాగా, పోలవరం నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇస్తే దాని ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్‌ (కేడీఎ్‌స)కు తరలించే 80 టీఎంసీలకు బదులుగా, సాగర్‌ ఎగువన ఉండే రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించడానికి బచావత్‌ ట్రైబ్యునల్‌ వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలు కలుపుకొని 1,050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంచడానికి కేంద్రం విచారణ విధి విధానాలు జారీ చేసింది. ఇందులో సగానికి పైగా కేటాయించాలని తెలంగాణ కోరుతోంది.

టీఎంసీల వారీగా కోరిందిలా

చిన్న నీటిపారుదల (89.15), సాగర్‌ ఎడమ కాల్వ (105.70), భీమా (20), జూరాల (17.80), తాగునీటి సరఫరా(5.70), పాకాల చెరువు (2.60), వైరా చెరువ ు(3.70), పాలేరు (4), డిండి (3.50), కోయిల్‌సాగర్‌ (3.90), ఆర్డీఎస్‌ (15.90), మూసీ (9.40), లంకాసాగర్‌ (1), కోటిపల్లి వాగు (2), ఊకచెట్టివాగు (1.90) నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ (40), కేఎల్‌ఐకు (53), నెట్టెంపాడు(25.4), పాలమూరు-రంగారెడ్డి(90), డిండి (30). కాగా, కోయిల్‌కొండ, గండీడ్‌, జూరాల వరద కాల్వ నిర్మాణం జరగాల్సి ఉందని, వీటికి 216 టీఎంసీలు కేటాయించాలని గుర్తు చేసింది.

Updated Date - Mar 24 , 2024 | 03:15 AM