Share News

గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:42 AM

రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7,740 కోట్లు కేటాయించి, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాచల రామయ్య ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని, ప్రజలు

గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఉప ముఖ్యమంత్రి భట్టి

భద్రాచలం, మార్చి 11: రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7,740 కోట్లు కేటాయించి, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాచల రామయ్య ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోమవారం భద్రాచలంలో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. నిధులు, నీళ్లు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ సర్కారు ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి తీరతామన్నారు. భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు.

సీతారామ నిర్మిస్తే సస్యశ్యామలం: తుమ్మల

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తే గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. భద్రాద్రి రాముని సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమని, రాముని ఆశీస్సులతో ఈ పథకం విజయవంతమవుతుందని ఆకాంక్షించారు. మోడికుంట, పాలెంవాగు ప్రాజెక్టులు, ప్రగళ్లపల్లి ఎత్తిపోతలకు నిధులు కేటాయించడంతోపాటు భద్రాచలం కరకట్టను పూర్తి చేస్తామని తెలిపారు. కరకట్ట పూర్తయితే వరద నీరు పట్టణంలోకి రాదని, శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పారు.

పదేళ్లలో వాగ్దానాలు తప్ప అభివృద్ధి లేదు: పొంగులేటి

పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం పదేళ్లలో వాగ్దానాలు చేయడం తప్ప ఏ హామీనీ నెరవేర్చలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరరెడ్డి ఆరోపించారు. మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదేనన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. కేసీఆర్‌ గతంలో భద్రాచలానికి రూ.100 కోట్లు నిదులిస్తామని చెప్పి, రాముణ్ని కూడా మోసం చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 95 వేల ఇళ్లే పూర్తి చేసిందన్నారు. మిగిలిన ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం నిర్మించి, పేదలకు అందిస్తుందని ప్రకటించారు.

పేదల కోసమే పని చేస్తాం: కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల కోసమే పని చేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు, కూతురు ఫాంహౌ్‌సలు కట్టుకున్నారు తప్ప, పేదలకు ఇళ్లు నిర్మించలేదని మండిపడ్డారు. గత గవర్నరు కేసీఆర్‌ను కాళేశ్వరరావు అన్నారని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కాళేశ్వరం అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇది పేదల ప్రభుత్వం: సీతక్క

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని, పేదల కోసం పని చేస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. పేదల కళ్లలో ఆనందం చూసేందుకే ఆరు గ్యారెంటీలు ప్రకటించి, అమలు చేస్తున్నామని తెలిపారు. అన్ని హామీలనూ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలం నుంచి ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు.

Updated Date - Mar 12 , 2024 | 03:42 AM