Share News

500 కుటుంబాల చేతుల్లో 75ు సంపద

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:59 AM

దేశ సంపదలో 75 శాతం కేవలం 500 కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమై ఉందని.. ప్రజల జీవితాలు ఛిద్రమైపోతున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

500 కుటుంబాల చేతుల్లో 75ు సంపద

తెలంగాణ రచయితలు కొత్త ఒరవడిసృష్టించాలి: జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి

తెలంగాణ భాషా, సాహిత్యరంగాలకు డ్రాఫ్ట్‌ రూపొందించాలి: కె.శ్రీనివాస్‌

గత పాలకులు తెలంగాణ జాతికి చేతబడి చేశారు: అందెశ్రీ

బర్కత్‌పుర, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశ సంపదలో 75 శాతం కేవలం 500 కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమై ఉందని.. ప్రజల జీవితాలు ఛిద్రమైపోతున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రచయితలు దేశం వైపు దృష్టి సారించి సత్యాన్వేషణ చేయాలని.. తమ రచనలను ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన ‘తెలంగాణ రచయితల వేదిక 8వ రాష్ట్ర మహాసభల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాహిత్యం మానవ సంబంధాలను దగ్గరకు తీసుకురావాలని.. రచయితలు మార్కెట్‌ పోకడలను అనుసరిస్తే సాహిత్యం ఆత్మహత్య చేసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రచయితలు భాష, సాహిత్య, సాంస్కృతికపరంగా కొత్త ఒరవడులను సృష్టించాలన్నారు. ఇక.. తెలుగు భాష, సాంస్కృతిక, సాహిత్య రంగాలపై ప్రత్యేక పాలసీని రూపొందించుకోవాలని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. గత పదేళ్లలో పాలకులు దీనికి సంబంధించి ఎలాంటి విధానాన్నీ రూపొందించలేదని విమర్శించారు. ప్రభుత్వం తెలంగాణ సమాజం, సాహిత్య, సాంస్కృతిక విధానంపై డ్రాఫ్ట్‌ను రూపొందించి ప్రజల్లో చర్చకు పెట్టాలని అభిప్రాయపడ్డారు.

రచయితల వేదిక వంటి సంస్థలు తెలంగాణ సాహిత్య, కళారంగాలకు మార్గనిర్దేశం చేస్తే బాగుంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం పరిధిలో పొందాల్సిన ప్రయోజనాలు, సాధించుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయన్న ఆయన.. సమాజంలో నైతిక విలువలు, సాహిత్య, సాంస్కృతిక రంగాలను పునరుజ్జీవింపజేయాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. తెలంగాణకు ఉన్న కీర్తిని గత పదేళ్లు అధికారం చెలాయించిన ప్రభుత్వం అణచివేసిందని ప్రముఖ కవి డాక్టర్‌ అందెశ్రీ ఆవేదన వెలిబుచ్చారు. గత పాలకులు చేసినది చండీయాగం కాదని తెలంగాణ జాతికి చేతబడి అని ఆయన విమర్శించారు. ‘‘వర్తమాన తెలంగాణ - కవులు, రచయితల కర్తవ్యాలు’’ అనే అంశంపై డాక్టర్‌ సంగిశెట్టి శ్రీనివాస్‌, తెలంగాణ భాష సాహిత్య, సాంస్కృతులకు ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఇక.. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు సభకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ సమగ్ర చరిత్రను పునర్‌లిఖించాలని, రాష్ట్ర సాహిత్య చరిత్ర, సంస్కృతి పునర్నిర్మాణంలో కవులు, రచయితలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భాషకు సమగ్ర పదకోశాన్ని నిర్మించాలని, గిరిజన కళలు, సంస్కృతిని కాపాడడం కోసం మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మహాసభకు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షత వహించగా ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, జూకంటి జగన్నాథం, సంగెవేని రవీంద్ర, జి.నాగభూషణం, అనిశెట్టి రజిత, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, జూపాక సుభద్ర, బూర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ దామెర రావులు, అశోక్‌కుమార్‌, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 05:59 AM