Share News

6,956 మంది స్టాఫ్‌నర్సులు

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:20 AM

రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల తుది ఫలితాలు వెల్లడయ్యాయి.

6,956 మంది స్టాఫ్‌నర్సులు

తుది ఫలితాలు విడుదల చేసిన మెడికల్‌ బోర్డు

7,094 పోస్టులకు నియామక ప్రక్రియ

అర్హులైన అభ్యర్థుల్లేక మిగిలిన 138 పోస్టులు

ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌, సెలక్షన్‌ జాబితా వెల్లడి

రేవంత్‌ చేతులమీదుగా నియామక పత్రాలు?

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఫైనల్‌ మెరిట్‌ లిస్టుతోపాటు సెలక్షన్‌ జాబితాను మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాధిపతుల పరిధిలోని 7,094 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకుగాను 6,956 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఆయా కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మరో 138 పోస్టులు మిగిలిపోయినట్లు పేర్కొన్నారు. కాగా, ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో దీన్ని ఒక కార్యక్రమంలా నిర్వహించాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇదే మొదటిది కానుండడంతో దీనిని ఒక పెద్ద కార్యక్రమంగా నిర్వహించనున్నారు. ఈ నెల 31న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రి కార్యక్రమాలను బట్టి చివరి నిమిషంలో తేదీ మారే అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొద్దిరోజుల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించి పోస్టింగులు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. నిజానికి 2022 డిసెంబరు 30వ తేదీన 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు.

మొత్తం 40,936 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 38,674 మంది హాజరయ్యారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను మూడు షిప్టుల్లో నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత గత డిసెంబరు 15న కాంగ్రెస్‌ సర్కారు మరో 1890 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. దాంతో మొత్తం స్టాఫ్‌నర్స్‌ పోస్టుల సంఖ్య 7,094కు చేరింది. ఇందులో ఒక్క డీఎంఈ, డీహెచ్‌ పరిధిలోనే 5,650 పోస్టులు ఉండగా, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో 757, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి, గురుకులాల్లో కలిపి మిగిలిన అన్ని పోస్టులు ఉన్నాయి. ఒకేసారి ఇంతమంది నర్సులు అందుబాటులోకి వస్తే.. మెడికల్‌ కాలేజీలు, జిల్లా, ఏరియా ఆస్పత్రులతోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత తగ్గనుంది. మెరుగైన వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Jan 29 , 2024 | 03:20 AM