Share News

6,000 కోట్లతో సోలార్‌ ప్యానెళ్ల పరిశ్రమ

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:45 AM

సౌర విద్యుత్తు పరికరాల తయారీ రంగంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూసిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సిద్ధమైంది.

6,000 కోట్లతో సోలార్‌ ప్యానెళ్ల పరిశ్రమ

రెన్యూసిస్‌ ఇండియా’ భారీ పెట్టుబడి

రాష్ట్ర సర్కార్‌తో అవగాహన ఒప్పందం

వచ్చే ఐదేళ్లలో 11వేల మందికి ఉపాధి

హైదరాబాద్‌, మహేశ్వరం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్తు పరికరాల తయారీ రంగంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూసిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సిద్ధమైంది. 6వేల కోట్ల రూపాయలతో సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌(పీవీ) మాడ్యూల్‌, పీవీ సెల్స్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో 11 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్‌ సిటీలోని ఆ పరిశ్రమ ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమక్షంలో ప్రభుత్వ అధికారులు, సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రెన్యూసి్‌సకు కర్ణాటక, మహారాష్ట్రలో తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అతిపెద్ద తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో హైదరాబాద్‌ సోలార్‌ పరికరాల తయారీకి కేంద్రంగా మారుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ర్టానిక్‌ పరికరాల తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని ప్రకటించారు. భారీ పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

అపోలో మైక్రోసిస్టమ్స్‌కు శంకుస్థాపన

టిఎ్‌సఐఐసీ ఏరోస్పేస్‌ పార్కులో అపోలో మైక్రోసిస్టమ్స్‌ సంస్థ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్‌ ఫర్‌ ఇంజీనియస్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌(ఐపీఐడీఎస్‌) యూనిట్‌కు మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే అపోలో మైక్రోసిస్టమ్స్‌ పరిశమ్ర క్లిష్టమైన రక్షణ, అంతరిక్ష సాంకేతికతలపై పని చేస్తుందని తెలిపారు. ఆయా రంగాల్లో స్వదేశీ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో అపోలో మైక్రో సిస్టమ్స్‌ వ్యాపార సామర్థ్యం పెరిగిందన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 800 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మహేశ్వరం హార్డ్‌వేర్‌ పార్క్‌, ఫ్యాబ్‌సిటీలో చిన్న తరహా పరిశ్రమల స్థాపనను ప్రభుత్వం తగిన సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ వ్యవస్థాపకుడు కరుణాకర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎ్‌సఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 07:39 AM