Share News

గ్రూపు-1లో మరో 60 పోస్టులు

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:55 AM

మరో 60 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రూపు-1లో మరో 60 పోస్టులు

ఆర్థిక శాఖ ఉత్తర్వులు.. 563కు కొలువులు

నోటిఫికేషన్‌ జారీకి టీఎ్‌సపీఎస్సీకి సూచన

సుప్రీంలో కేసు.. గత ప్రిలిమ్స్‌పై సందిగ్ధత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మరో 60 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీఎ్‌సపీఎస్సీకి సూచించారు. కొత్త పోస్టులకు సంబంధించిన రోస్టర్‌ పాయింట్ల వివరాలను టీఎ్‌సపీఎస్సీకి సమర్పించాలని జీవోలో ఆయా విభాగాల అధిపతులకు సూచించారు. కొత్త పోస్టుల్లో 24 డీఎస్పీ, 19 మండల పరిషత్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే 503 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజా పోస్టులను కలిపితే... గ్రూపు-1 మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరినట్టయింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 503 గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌ లీకైంది. దాంతో సదరు పరీక్షను రద్దు చేశారు. తర్వాత మళ్లీ రెండోసారి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. అయితే.. ఈ పరీక్ష నిర్వహణలో అధికారులు నిబంధనలను పాటించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పును టీఎ్‌సపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ప్రస్తుతం ఈ కేసును పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేస్తారా? లేదా? అనే విషయం సందిగ్ధంలో పడింది.

ప్రత్యేక నోటిఫికేషనా? అదనపు నోటిఫికేషనా?

తాజాగా ప్రకటించిన పోస్టుల భర్తీని ఎలా చేపడతారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం మళ్లీ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను జారీ చేస్తారా? లేక పాత నోటిఫికేషన్‌కు అనుబంధంగా అదనపు నోటిఫికేషన్‌ ఇస్తారా? అనే అంశంపై టీఎ్‌సపీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదనంగా నోటిఫికేషన్‌ను జారీ చేస్తే గతంలోని పోస్టులకు తాజా పోస్టులు అదనంగా చేరుతాయి. అటువంటప్పుడు, పోస్టుల భర్తీకి ఇప్పటికే పూర్తయిన ప్రిలిమ్స్‌నే పరిగణనలోకి తీసుకుంటారా? లేక, దాన్ని రద్దు చేసి, కొత్తగా మళ్లీ పరీక్షను నిర్వహిస్తారా? అనే విషయం కూడా కీలకంగా మారనుంది.

Updated Date - Feb 07 , 2024 | 09:55 AM