Share News

రెండ్రోజుల్లో 60 భేటీలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:18 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన తొలి విదేశీ పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎ్‌ఫ)లో బిజీబిజీగా గడుపుతున్నారు.

రెండ్రోజుల్లో 60 భేటీలు

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం.. దావోస్‌లో సీఎం రేవంత్‌ బిజీబిజీ

సర్కారు అందించే సాయంపై..

పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్న సీఎం

నోవార్టీస్‌, మెడ్‌ట్రానిక్స్‌ సీఈవోలతో ప్రత్యేక భేటీ

నైపుణ్యాభివృద్ధిపై నాస్కామ్‌ అధ్యక్షుడితో చర్చలు

హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ను స్థాపిస్తాం

కుదిరిన ఎంవోయూ.. వచ్చేనెల 28న ముహూర్తం

ప్రకటించిన డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండ్‌

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన తొలి విదేశీ పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎ్‌ఫ)లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సదస్సు సోమవారం ప్రారంభం కాగా.. రెండ్రోజుల్లో 60 మంది వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ సర్కారు విధానాలను వారికి వివరిస్తూ.. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను గురించి విశదీకరిస్తున్నారు. డబ్ల్యూఈఎఫ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ఆయన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఈ భేటీల్లో పాల్గొన్నారు. అమెజాన్‌ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ పుంకేతో జరిగిన భేటీలో రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆ సంస్థ పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్‌ డేటా సెంటర్‌, రెండో అతిపెద్ద కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌తోనూ రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. ఆ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లో ఉండగా.. భారత్‌ కేంద్రంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది.

ఇక్కడ పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), క్లినికల్‌ డెవలప్‌మెంట్‌, మెడికల్‌ రైటింగ్‌కు సంబంధించిన విభాగాలున్నాయి. భవిష్యత్‌లో నోవార్టిస్‌ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. యూఎస్‌ అగెనెస్ట్‌ అల్జీమర్స్‌ చైర్మన్‌ జార్జ్‌ వ్రాదెన్‌బర్గ్‌తోనూ సీఎం సమావేశమై.. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణపై సలహాలను కోరారు. తొలిరోజు సదస్సు సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండ్‌, ఇతర నిర్వాహకులతో రేవంత్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్‌ హసెంటోతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్‌మ్యా్‌పను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే.. ప్రజలు సంపన్నులవుతారని, రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రేవంత్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సీఎం నిర్వహించిన వరుస భేటీల్లో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇన్వె్‌స్టమెంట్స్‌ ప్రమోషన్స్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీ్‌స(నాస్కామ్‌) అధ్యక్షుడు దేబ్జానీ ఘోష్‌తో రేవంత్‌ సమావేశమై.. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే అంశంపై చర్చించారు. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఉన్న యువత చదువు పూర్తయ్యేలోపే వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అందించాల్సిన నైపుణ్యాభివృద్ధిపై సహకరించాలని నాస్కామ్‌ను కోరారు. ఈ విషయంలో నాస్కామ్‌ ముందుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. దావోస్‌ అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌(సీ4ఐఆర్‌) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. దీనికి సంబంధించి సదస్సు అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండ్‌, సీఎం రేవంత్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో జరగనున్న సదస్సులో ఈ సెంటర్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సీఎం సారథ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే స్టేట్‌ హెల్త్‌టెక్‌ ల్యాండ్‌స్కేప్‌ సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. రాష్ట్రంలో ఆరోగ్యం, పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేసేందుకు, విదేశీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్‌

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పేందుకు ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ తెలంగాణ’ నినాదంతో ‘వేర్‌ ట్రెడీషన్‌ మీట్స్‌ ఇన్నోవేషన్‌’ ట్యాగ్‌లైన్‌తో డబ్ల్యూఈఎ్‌ఫలో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా రూపొందించిన పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్‌, బతుకమ్మ, బోనాల పండుగలు, కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్‌, పోచంపల్లి ఇక్కత్‌, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ-హబ్‌తోపాటు వివిధ రంగాల విశేషాలతో రూపొందించిన చిత్రాలు చూపరులను కట్టిపారేస్తున్నాయి. వివిధ దేశాల రాజకీయ దిగ్గజాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి ఇందులోనే సమావేశమవుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 07:19 AM