Share News

మేడారానికి 6వేల బస్సులు!

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:53 AM

మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 6 వేల బస్సులను నడపనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈనెల 21 నుంచి 25 జరిగే జాతరకు 18 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 51 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు

మేడారానికి 6వేల బస్సులు!

18 నుంచి 25 వరకు అందుబాటులో

మహిళలకు ఉచిత ప్రయాణమే..

రవాణ శాఖ మంత్రి పొన్నం

హైదరాబాద్‌/ములుగు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 6 వేల బస్సులను నడపనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈనెల 21 నుంచి 25 జరిగే జాతరకు 18 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 51 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని స్పష్టంచేశారు. మంత్రి సీతక్క, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి సోమవారం ఆయన మేడారం వచ్చారు. తొలుత సమ్మక్క, సారలమ్మ వనదేవతల గద్దెలను దర్శించుకున్న వారు.. అక్కడ 55 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక బస్టాండ్‌, బేస్‌ క్యాంపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్‌-2 డిపో నుంచి విశాఖపట్నం, రాజమండ్రి రూట్లో నడిపేందుకు గాను 4 లహరి (స్లీపర్‌ కమ్‌ సీటర్‌) కొత్త బస్సులను మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హరితా హోటల్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో పొన్నం మాట్లాడుతూ.. జాతరకు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు భక్తులను బస్సుల్లో తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా వెయ్యి మంది మహిళా పోలీసు సిబ్బందిని మేడారం విధులకు నియమిస్తామన్నారు. జాతరలో నార్లాపూర్‌ చింతల్‌ క్రాస్‌ నుంచి మేడారం గద్దెల వరకు ఉచిత సర్వీసులను నడుపుతామని తెలిపారు. మొత్తం 15 వేల మంది అధికారులు, సిబ్బందితో జాతరను విజయవంతంగా జరిపిస్తామని స్పష్టంచేశారు. జాతీయ రహదారి విస్తరణ, చిన్నచిన్న సీసీ రోడ్ల పనులు మినహా జాతర ఏర్పాట్లన్నీ పూర్తికావచ్చాయని సీతక్క చెప్పారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరామని, ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా వినతిపత్రం అందించామని తెలిపారు. రూ.105 కోట్లతో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Feb 06 , 2024 | 03:53 AM