Share News

59 జీవో భూముల లావాదేవీలు బంద్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:29 AM

హైదరాబాద్‌ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 59 జీవోను అడ్డుపెట్టుకొని, అక్రమంగా క్రమబద్ధీకరించుకుని, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన రూ.కోట్ల విలువైన స్థలాలను అబయెన్స్‌లో పెట్టారు. అంటే.. ఆ స్థలాలపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదు. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు

59 జీవో భూముల లావాదేవీలు బంద్‌

రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 59 జీవోను అడ్డుపెట్టుకొని, అక్రమంగా క్రమబద్ధీకరించుకుని, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన రూ.కోట్ల విలువైన స్థలాలను అబయెన్స్‌లో పెట్టారు. అంటే.. ఆ స్థలాలపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదు. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకూడదు. భవన నిర్మాణాలకు అనుమతులు రావు. ముఖ్యంగా.. శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి, నానక్‌రామ్‌గూడల్లోని భూములపై అబయెన్స్‌ విధిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ‘ఫలితాలకు ముందు.. భూమేత’ శీర్షికన డిసెంబరు 11న ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్యే సహకారంతో.. ఎన్నికల ఫలితాలకు ముందు రోజు గోపన్‌పల్లిలోని సర్వే నంబర్‌ 74లో ఎలాంటి ఇళ్లు, ఇంటి నంబర్లు లేకున్నా.. 30 మందికి ఒక్కొక్కరికి 430 నుంచి 980 చదరపు గజాల వరకు మొత్తం 12,879 చదరపు గజాలను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరిస్తూ చేసిన కన్వేయన్స్‌ డీడ్‌లను జారీ చేశారని ‘ఆంధ్రజ్యోతి’ స్పష్టం చేసింది. ఆ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను, కన్వేయన్స్‌ డీడ్‌లను అబయెన్స్‌లో పెట్టాలని జిల్లా రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. ఆ స్థలాల్లో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. సీసీఎల్‌ఏ అధికారులు కూడా రంగంలోకి దిగి, చర్యలు చేపట్టారు. అలాగే, నానక్‌రాంగూడలోని సర్వేనంబర్‌ 149లో 750కోట్ల విలువ చేసే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని 15మందికి జీవో 59 కింద అక్రమంగా క్రమబద్ధీకరించడంపై ‘భూంఫట్‌ స్వాహా’ అనే శీర్షికతో జనవరి 10న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ.. సంబంధిత కన్వేయన్స్‌ డీడ్‌లను అబయెన్స్‌లో పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేపట్టినట్లు సమాచారం.

Updated Date - Feb 06 , 2024 | 04:29 AM