Share News

కొడంగల్‌ నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలి

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:40 PM

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొడంగల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 50వేల మెజార్టీ తగ్గకుండా ఆధిక్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కొడంగల్‌ నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలి
కొడంగల్‌లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి ) : మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొడంగల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 50వేల మెజార్టీ తగ్గకుండా ఆధిక్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం కొడంగల్‌లోని తన నివాసంలో పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు సంపత్‌కుమార్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలు, రెండు మునిసిపాలిటీల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమీక్ష రాత్రి7 గంటల వరకు కొనసాగింది. అనంతరం ఆయన తన నివాసానికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొడంగల్‌లో కాంగ్రె్‌సను ఓడించి రేవంత్‌రెడ్డిని కింద పడేయాలని కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని ఓడించి రేవంత్‌రెడ్డిని దెబ్బకొట్టాలని తెరచాటున చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం, కొడంగల్‌ నియోజకవర్గం కోసం కష్టపడుతున్న రేవంత్‌రెడ్డిని ఎందుకు పడగొట్టాలి?, ఎన్నికల్లో ఎందుకు కాంగ్రె్‌సను ఓడించాలని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని ఎందుకు కింద పడేయాలనే కుట్ర జరుగుతున్నదో ప్రజలు ఆలోచించాలన్నారు. కొడంగల్‌ను దెబ్బ తీసేందుకు కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారని, ఇదంతా రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడం కాదని కొడంగల్‌ అభివృద్ధినే దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంపై జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్‌ కార్యకర్తలు మరో రేవంత్‌రెడ్డిగా మారి పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు కొడంగలేనని స్పష్టం చేశారు. తనతో కొట్లాడే హక్కు.. తనతో పట్టుపట్టి పని చేయించుకునే అధికారం మీకున్నదని ఆయన ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో పేర్కొన్నారు. వంద రోజుల్లో కొడంగల్‌ నియోజకవర్గానికి మెడికల్‌, ఇంజనీరింగ్‌, వెటర్నరీ, నర్సింగ్‌ జూనియర్‌, డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నామని, వందల కోట్లతో తండాలకు రోడ్లు మంజూరు చేసుకున్నామని, రూ.4వేల కోట్లతో నారాయణపేట్‌ - కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొడంగల్‌లో ఏ ఒక్కరికైనా డబుల్‌ బెడ్రూం ఇచ్చిందా ? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిని కొడంగల్‌ నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. కొడంగల్‌ నియోజకవర్గ ఇంచార్జి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌, టీపీసీసీ ప్రతినిధి ఎండీ. యూసూఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:40 PM