Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కాళేశ్వరానికి 4 నెలలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:49 AM

కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే పరిస్థితులు నెలకొననున్నాయా? ఈ ఏడాది మొత్తం ప్రాజెక్టు కింద పంటల సాగుకు నీరందించలేని పరిస్థితి ఎదురుకానుందా? అంటే..

కాళేశ్వరానికి 4 నెలలు

బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలకు

కారణాలు, పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు

నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు

ఆ తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణకు అవకాశం

జూన్‌, జూలైలో వరదలు.. మరమ్మతులకు వీల్లేని పరిస్థితి

ఏడాది కాలం వృథా అవుతుందా? అన్న అనుమానాలు

6న ప్రాజెక్టును పరిశీలించనున్న నిపుణుల కమిటీ

కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే పరిస్థితులు నెలకొననున్నాయా? ఈ ఏడాది మొత్తం ప్రాజెక్టు కింద పంటల సాగుకు నీరందించలేని పరిస్థితి ఎదురుకానుందా? అంటే.. ప్రస్తుత పరిణామాలను బట్టి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన నేపథ్యంలో.. ఈ రెండింటితోపాటు సుందిళ్ల బ్యారేజీ డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు నేషనల్‌ డ్యామ్‌ ేసఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. మూడు బ్యారేజీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి.. వాటికి పరిష్కారాలతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫారసు చేయాలని కమిటీని ఆదేశించారు. ఈ మేరకు నాలుగు నెలల్లోగా ఎన్డీఎ్‌సఏకు నివేదిక సమర్పించాలని గడువు విధించారు.

మరోవైపు.. ఎన్డీఎ్‌సఏ నిపుణుల కమిటీ.. బ్యారేజీలను పరీక్షించి నివేదిక సమర్పించిన తర్వాతే వాటికి మరమ్మతులు గానీ, పునరుద్ధరణ పనులు గానీ చేపట్టేందుకు వీలుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అంటే.. కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలివారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. దీంతో రానున్న నాలుగు నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, మేడిగడ్డ బ్యారేజీకి జూన్‌, జూలై మాసాల్లోనే వరద ప్రారంభమవుతుంది. ఆలోగా నిపుణుల కమిటీ నివేదిక వచ్చినా.. వెంటనే మరమ్మతు పనులు చేయడానికి కూడా అవకాశం ఉండదని, వరదలు తగ్గాకే సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే వరదలు తగ్గడానికి డిసెంబరు, జనవరి వరకు ఆగాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కాలం వృధా కానుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ.. నిపుణుల కమిటీ ప్రాజెక్టును సందర్శించాక వెంటనే తీసుకోవాల్సిన కొన్ని తాత్కాలిక చర్యల్ని సూచిస్తూ మధ్యంతర నివేదికను ఇస్తే మాత్రం.. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నిపుణుల కమిటీ తన పనిని వెంటనే మొదలు పెట్టనుంది. ఈ నెల 6న ప్రాజెక్టును పరిశీలించనుంది.

గతంలోనూ నిపుణుల కమిటీ నివేదిక..

గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ కుంగిపోగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్‌ అయిన విషయం తెలిసిందే. ప్లానింగ్‌, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎ్‌సఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్‌ పైల్స్‌కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదే పదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో పేర్కొంది. మూడు బ్యారేజీలను ఒకే తరహా డిజైన్లు, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలుంటాయని, అన్నింటికీ జియోఫిజికల్‌, జియోలాజికల్‌ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న ఎన్డీఎ్‌సఏకు లేఖ రాసింది. ఈ మేరకు డ్యామ్‌ ేసఫ్టీ చట్టం 2021లోని 2వ షెడ్యూల్‌లోని 8వ క్లాజు కింద కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎ్‌సఏ నిర్ణయం తీసుకుంది.

బ్యారేజీల అధ్యయనానికి విధి విధానాలివే..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తనిఖీలు నిర్వహించాలి. మూడు బ్యారేజీలను నిర్మించిన స్థలం(సైట్‌)తో పాటు హైడ్రాలిక్‌, స్ట్రక్చరల్‌, జియోటెక్నికల్‌ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరపాలి.

ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్‌, డిజైన్ల నివేదికలు, టెస్ట్‌లు, సైట్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్స్‌, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్‌, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలు/మెటీరియల్‌ను పరిశీలించాలి.

బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్య వర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి.

ప్రభుత్వ అధికారులతోపాటు సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి బ్యారేజీలకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించాలి.

మూడు బ్యారేజీ డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన ఫిజికల్‌, మ్యాథమేటికల్‌ మోడల్‌ స్టడీ్‌సను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షించి చూస్తారు)

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతోపాటు ఇతర లోపాలకు కారణాలను కమిటీ పరీక్షించి నిర్ధారించాలి. మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని అపాయకర పరిస్థితులను పరీక్షించి కారణాలను నిర్ధారించాలి.

మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి.. నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు, పరిశోధనల్ని కమిటీ సిఫారసు చేయాలి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలనూ సూచించాలి.

అవసరమైతే ఎన్డీఎ్‌సఏ చైర్మన్‌ అనుమతితో ఈ కమిటీలో ఎవరైనా ఇతర సభ్యుడిని నియమించుకోవచ్చు.

నాలుగు నెలల్లోగా ఎన్డీఎ్‌సఏకు కమిటీ నివేదిక సమర్పించాలి.

6న రానున్న నిపుణుల కమిటీ : ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణుల కమిటీ ఈ నెల 6న రానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆ కమిటీ రాకను స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనలకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని గతంలోనే ఎన్‌డీఎ్‌సఏ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించిందని తెలిపారు. అనంతరం సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను కూడా పరిశీలించి వాటిలోనూ నీటిని ఖాళీ చేయాలని సూచించిందని వెల్లడించారు. వారి సూచన మేరకే నీటిని ఖాళీ చేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్‌ చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడానికి నాలుగు నెలల సమయమున్నప్పటికీ, సాధ్యమైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని మంత్రి తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాల్లోనూ నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిందిపోయి.. ఒక్క పిల్లర్‌ మాత్రమే కుంగిపోయిందనడమేంటని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర, రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 03:49 AM