Share News

Electoral Bonds: బీఆర్‌ఎస్‌కు ఒకే రోజు రూ.268 కోట్లు

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:28 AM

ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్‌-4 రాజకీయ పార్టీల్లో 4వ స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఆ క్రమంలో మరిన్ని రికార్డులు సృష్టించింది.

Electoral Bonds: బీఆర్‌ఎస్‌కు ఒకే రోజు రూ.268 కోట్లు

2021 అక్టోబరు-2023 జూలై మధ్య 4 రోజుల్లో రూ.663 కోట్ల బాండ్లు

దాతల్లో మేఘా, ‘యశోదా’, ఐటీసీ, రహేజా, రాజపుష్ప తదితర సంస్థలు!

మేఘా విరాళాలే రూ.201 కోట్లు బీజేపీకి ‘క్విక్‌ సప్లై’.. రూ.385 కోట్లు

ఫ్యూచర్‌ గేమింగ్‌, మేఘా తర్వాత ఎక్కువ బాండ్లు కొన్న సంస్థ ఇదే

హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్‌-4 రాజకీయ పార్టీల్లో 4వ స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఆ క్రమంలో మరిన్ని రికార్డులు సృష్టించింది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1,322 కోట్లు కాగా.. అందులో సగానికిపైగా విరాళాలు (రూ.663 కోట్లు.. అంటే 50.15ు) నాలుగు రోజుల్లోనే వచ్చాయి! ఒకరోజైతే ఏకంగా రూ.268 కోట్ల విలువైన బాండ్లు ఆ పార్టీకి వచ్చిపడ్డాయి!! ఎన్నికల కమిషన్‌కు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించిన వివరాల ప్రకారం..

2022 ఏప్రిల్‌ 12న.. బీఆర్‌ఎ్‌సకు అందిన బాండ్ల విలువ రూ.268 కోట్లు.

2023 జూలై 13న రూ.218 కోట్లు, 2022 ఏప్రిల్‌ 11న రూ.92 కోట్లు, 2021 అక్టోబరు 8న రూ.85 కోట్లు ఆ పార్టీకి విరాళాలుగా వచ్చాయి.

ఈ నిధులన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, ఆసుపత్రులు ఇచ్చినవే. ఉదాహరణకు.. ఒక్క మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నుంచే భారత రాష్ట్ర సమితి పార్టీకి రూ.201 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. అలాగే ఐటీసీ, రహేజా, యశోదా ఆస్పత్రి, రాజపుష్ప ఎసెట్‌ వంటివి బీఆర్‌ఎ్‌సకు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నాయి.

రెండే పార్టీలకు..

క్విక్‌ సప్లై చైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఫ్యూచర్‌ గేమింగ్‌, మేఘా ఇంజనీరింగ్‌ తర్వాత దేశంలో అత్యధికంగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన సంస్థ ఇది! రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో సంబంధాలున్న ఈ కంపెనీ.. 2021-22 నుంచి 2023-24 నడుమ మొత్తం రూ.410 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి వాటన్నింటినీ రెండంటే రెండే పార్టీలకు ఇచ్చేసింది. ఆ రెండు పార్టీల్లో ఒకటి బీజేపీ.. రెండోది శివసేన. తాను కొన్న వాటిలో రూ.385 కోట్ల విలువైన బాండ్లను బీజేపీకి.. మిగతా రూ.25 కోట్ల బాండ్లను శివసేన పార్టీకి ఇచ్చినట్టు.. గురువారం ఈసీ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన సమాచారం ఆధారంగా వెల్లడైంది. క్విక్‌ సప్లై తరహాలోనే రిలయన్స్‌తో సంబంధాలున్న మరో కంపెనీ హనీవెల్‌ ప్రాపర్టీస్‌.. 2021 ఏప్రిల్‌ 8న మొత్తం రూ.30 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసి, వాటన్నింటినీ బీజేపీకి సమర్పించుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో క్విక్‌సప్లై సంస్థ నికర లాభం 21.7 కోట్లు కాగా.. ఆ పార్టీ ఆ ఏడాది కొన్న బాండ్ల విలువ రూ.360 కోట్లు కావడం గమనార్హం.

Updated Date - Mar 22 , 2024 | 07:08 AM