Share News

రుణాల పేరిట రూ.2.37కోట్లు స్వాహా

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:27 AM

ఖాతాదారుల పేరుతో బ్యాంకు మేనేజర్‌ రుణాలు తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం తాళ్లసింగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రుణాల పేరిట  రూ.2.37కోట్లు స్వాహా

  • ఖాతాల నుంచి కాజేసిన బ్యాంక్‌ మేనేజర్‌

నూతన్‌కల్‌: ఖాతాదారుల పేరుతో బ్యాంకు మేనేజర్‌ రుణాలు తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం తాళ్లసింగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాళ్లసింగారం బ్రాంచ్‌ ఎస్‌బీఐ మేనేజర్‌గా పనిచేసిన హరిప్రసాద్‌ గతంలో సమభావన సంఘాలు, రైతుల పేరుతో రూ.2.37 కోట్లను జారీ చేసి, ఆ వెంటనే స్వాహా చేశారు. మూణ్నెల్ల క్రితం బ్యాంకు ఆడిట్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీక్యాతండా గ్రామంలో ఉన్న మల్సూర్‌ స్వామి సమభావన సంఘం, దండుమైసమ్మ సమభావన సంఘం, శ్రీవేంకటేశ్వర సమభావన సంఘాలకు తలా రూ.15 లక్షల చొప్పున, తాళ్లసింగారం గ్రామంలో రైతులకు రూ. లక్షలు అప్పు ఇచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అయితే.. అన్ని ఖాతాల్లోనూ రుణం డబ్బు జమవ్వగానే.. ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించారు. ఇలా రూ.2.37 కోట్ల మేర రుణాల మంజూరు.. ఆ వెంటనే ఇతర ఖాతాల్లోకి బదిలీ జరిగినట్లు నిర్ధారించారు. ఇలా నగదు బదిలీ చేయడంలో హరిప్రసాద్‌కు బ్యాంకులోని ఆధార్‌ కేంద్రం నిర్వాహకుడు, ఇతర సిబ్బంది సహకరించినట్లు సమాచారం. ఆడిట్‌ తర్వాత ఉన్నతాధికారులు హరిప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు. నెల క్రితం బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలను స్వీకరించిన రవీందర్‌.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తుంగతుర్తి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై సైదులు గురువారం దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పలువురు బాధితుల స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారు.

Updated Date - Mar 22 , 2024 | 07:40 AM