Share News

22 ఎకరాల నిషేధిత జాబితా భూమి.. ఎంపీ సంతోష్‌కు పట్టా

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:27 AM

ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సోమవారం పెద్ద బాంబునే పేల్చింది. కేసీఆర్‌కు అన్నివేళలా వెన్నంటి ఉండే ఆయన బంధువు, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌..

22 ఎకరాల నిషేధిత జాబితా భూమి.. ఎంపీ సంతోష్‌కు పట్టా

ఆయన భార్య ; బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్‌

ధరణితో కేసీఆర్‌ కుటుంబం అక్రమాలు.. కేటీఆర్‌ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ

ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు: ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి

హైదరాబాద్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సోమవారం పెద్ద బాంబునే పేల్చింది. కేసీఆర్‌కు అన్నివేళలా వెన్నంటి ఉండే ఆయన బంధువు, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతో్‌షకుమార్‌.. ధరణిని ఆసరాగా చేసుకొని 22 ఎకరాల నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కాంగ్రెస్‌ నేత, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. గ్రామంలోని అందరి భూములు నిషేధిత జాబితాలో ఉండగా, సంతోష్‌ ఒక్కడి భూమి మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ధరణి కమిటీ మరో సభ్యుడు సునీల్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి ద్వారా తొలుత పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి.. వాటిని పెద్దలు చేజిక్కించుకున్న తర్వాత దాని నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేసుకునే వ్యవహారం గత ప్రభుత్వంలో కొనసాగిందని తెలిపారు. ‘‘సంతోష్‌ అనే బీఆర్‌ఎస్‌ ఎంపీ, వారి కుటుంబానికి చెందినవారి పేరుమీద కూడా భూములున్నాయి. అప్పటివరకు 22(ఎ) కింద నిషేధిత జాబితాలో ఉన్న భూమి వారి పేరిట పట్టా అయింది. ఆ గ్రామంలో అందరి భూములూ నిషేధిత జాబితాలో ఉంటాయి. కానీ, ఆయనకు మాత్రం ఆ 22 ఎకరాలు పట్టా అయిపోయింది’’ అని కోదండరెడ్డి అన్నారు. ఎంపీ సంతోష్‌ భార్య, ఓ ఎమ్మెల్సీ, ఇద్దరు ఆ పార్టీ నేతలు కలిసి ఒకే గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 22 ఎకరాలను తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ నలుగురికి చెందిన ఒక కంపెనీ పేరుతో ఈ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వెల్లడించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా పట్టాలుగా మార్చుకున్నారనేందుకు ఇది ఒక్క ఉదాహరణ మాత్రమేనన్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లపై తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. మరోవైపు వివాదరహితంగా ఉన్న 23 లక్షల ఎకరాలను వివాదాస్పద భూముల కేటగిరీ(బీ)లో చేర్చారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని భూ కుంభకోణాలు ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో జరిగాయని ధ్వజమెత్తారు. ఎవరినీ సంప్రదించకుండా గతంలో దివాళా తీసిన విదేశీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కంపెనీకి ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించారని కోదండరెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఇదే కంపెనీ టెరాసీస్‌, క్వాంటెల్లాగా పేర్లు మార్చుకుందని వివరించారు. ఈ మూడు కంపెనీలు రాష్ట్రానికి చెందిన రామలింగరాజు కుటుంబీకుడు శ్రీగారి శ్రీధర్‌రాజు పేరిట ఉన్నాయని తెలిపారు. రామలింగరాజు కుటుంబానికి కేటీఆర్‌తో అవినాభావ సంబంధం ఉందన్నారు. ధరణి పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, ఆ శాఖ మంత్రిగా కూడా ఉన్న గత సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దీనికి ప్రధాన కారణమని కోదండరెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ తన కార్యాలయంలో ధరణికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే పెట్టుకున్నారని తెలిపారు.

17 వరకు స్పెషల్‌ డ్రైవ్‌..

ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్‌ డ్రైవ్‌ను మరో వారం రోజులపాటు పొడిగించారు. దరఖాస్తులు భారీగా వస్తున్నందున దీనిని ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పరిష్కారం దిశగా ఉన్నాయని తెలిపింది.

Updated Date - Mar 12 , 2024 | 04:27 AM