Share News

20 లక్షల ఎకరాలు ఎండిపోవడం పచ్చి అబద్ధం

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:57 AM

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ ప్రణాళిక

20 లక్షల ఎకరాలు ఎండిపోవడం పచ్చి అబద్ధం

రైతులను మా ప్రభుత్వం ఆదుకుంటుంది: జి.చిన్నారెడ్డి

రాంనగర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జీ.చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన చిన్నారెడ్డి మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రైతులు, ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గత వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల సుమారు రెండు లక్షల ఎకరాల వరకు పంట ఎండిపోయిందని, కానీ 20 లక్షలకు పైగా నష్టం కలిగిందని పత్రిపక్షాలు ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామాల అవసరాలను గుర్తించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం చైర్మన్‌ బోమిరెడ్డి కృపాకర్‌ రెడ్డికి ఆత్మీయ సన్మానం జరిగింది.

Updated Date - Apr 08 , 2024 | 03:57 AM