వాహనాల తనిఖీల్లో 2 కోట్ల నగదు స్వాధీనం
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:41 AM
ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. చెక్‌పోస్టులలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మంగళవారం వివిధ చెక్‌పోస్టుల వద్ద

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్, ఏప్రిల్ 2: ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. చెక్‌పోస్టులలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మంగళవారం వివిధ చెక్‌పోస్టుల వద్ద దాదాపు రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పాత బస్తీలోని దారుసలాం చెక్‌పోస్టు వద్ద టీఎస్ 15 ఈఎస్ 5999 కారు నుంచి దాదాపు రూ. 1.5 కోట్ల నగదు ఉన్న మూడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పురానాపూల్ ఎక్స్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి నుంచి పది లక్షలను సౌత్- ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి వద్ద జాతీయ రహదారి 365/ఏపై ఏర్పాటు చేసిన ఎస్‌ఎ్‌సటీ చెక్‌పోస్టు వద్ద రూ. 8లక్షల నగదు పట్టుబడింది. మాలోతు సోరన్‌సింగ్ అనేవ్యక్తి నుంచి రూ.4.50లక్షలు, కావటి రవి వద్ద నుంచి రూ.3.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తులను ప్రశ్నించగా తాము రైతులమని, తాము పండించిన మిర్చిని ఖమ్మం మార్కెట్‌లో విక్రయించుకుని నగదు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఎలాంటి రశీదులు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 21 లక్షలు రూపాయల నగదు పట్టుబడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టులో సరైన పత్రాలు లేని సుమారు రూ. 2 లక్షల నగదు పట్టుబడింది.