Share News

వీధి కుక్కల్ని వెంటాడి.. తుపాకీతో వేటాడి!

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:30 AM

ఇంట్లోంచి బయట అడుగుపెడితే వెంబడించి కరుస్తున్నాయన్న కారణంతో ఊర్లోనే కొందరు చేసిన పనా? లేదంటే.. కుక్కకాటుతో తమ ఆప్తుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలయ్యారనే ఆగ్రహంతో సాగించిన వేటా? లేదంటే..

వీధి కుక్కల్ని వెంటాడి.. తుపాకీతో వేటాడి!

18 శునకాల మృతి..కొన్నింటికి గాయాలు

అర్ధరాత్రి నలుగురి దుశ్చర్య

మహబూబ్‌నగర్‌ జిల్లా పొన్నకల్‌లో ఘటన

మహబూబ్‌నగర్‌/అడ్డాకుల, ఫిబ్రవరి 16: ఇంట్లోంచి బయట అడుగుపెడితే వెంబడించి కరుస్తున్నాయన్న కారణంతో ఊర్లోనే కొందరు చేసిన పనా? లేదంటే.. కుక్కకాటుతో తమ ఆప్తుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలయ్యారనే ఆగ్రహంతో సాగించిన వేటా? లేదంటే.. చోరీలకు ‘అడ్డు’గా ఉన్నాయని దొంగలు పనిగట్టుకొని చేశారా? తెలియదు గానీ.. వీఽధి కుక్కలపై తుపాకీ మోత మోగింది. పథకం ప్రకారం అర్ధరాత్రి పూట కారులో గ్రామంలోకి చొరబడిన కొందరు వీధి కుక్కలను వెంటాడి మరీ కాల్పులు జరిపారు. అరగంటకుపైగా వీధి వీధినా తిరుగుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 18 కుక్కలు మృతిచెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత 1:25 గంటలకు కారులో నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి గ్రామంలోకి చొరబడ్డారు. లోకల్‌మేడ్‌ తుపాకులతో కనిపించిన కుక్కలపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. అరగంట పాటు గ్రామం అంతా తిరుగుతూ కాల్పులు జరిపారు. కుక్కల అరుపులు, గన్‌ శబ్దాలతో బయటకొచ్చినగ్రామస్థులు జరిగిన ఘటనను చూసి భయంతో ఇళ్లలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నారు. కొందరు ఇళ్లపై ఎక్కి చూశారు. వచ్చిన దుండగులు.. 2:08 గంటలకు పని ముగించుకొని వచ్చిన కారులోనే వెళ్లిపోయారు. దుండగులొచ్చింది బ్రీజా కారులో అని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం భూత్పూర్‌ సీఐ రామకృష్ణ, అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్‌, పశుసంవర్ధక శాఖ అధికారులు క్లూస్‌ టీమ్‌తో గ్రామానికి చేరుకొని ప్రజలను విచారించారు. వెటర్నరీ డాక్టర్‌ రాజేశ్‌ఖన్నా ఆధ్వర్యంలో గ్రామ స్మశాన వాటిక వద్ద కుక్కల కళేబరాలకు పంచనామా నిర్వహించారు. శాంపిళ్లను హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. కుక్కల కళేబరాల్లో చిన్న సైజు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. గ్రామ కార్యదర్శి విజయరామరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కంట్రీమేడ్‌ గన్‌ ఉపయోగించి కుక్కలను చంపారని, నిందితులను పట్టుకోవడానికి విచారణ వేగవంతం చేశామని ఎస్సై శ్రీనివాస్‌ చెప్పారు. అయితే.. కుక్కలను వెంటాడి మరీ దుండగలు ఎందుకు చంపారనేది మిస్టరీగా మారింది.

Updated Date - Feb 17 , 2024 | 04:30 AM