Share News

నకిలీ పత్రాలతో రూ.15 కోట్ల ప్లాట్లు స్వాహా

ABN , Publish Date - May 02 , 2024 | 05:10 AM

నకిలీ పత్రాలతో పాటు నకిలీ వంశస్తులను కూడా సృష్టించి కోట్ల విలువైన ప్లాట్లను స్వాహా చేస్తున్న ఓ ముఠా గుట్టును జిల్లా సీసీఎస్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ వివరాలను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్‌ వెల్లడించారు.

నకిలీ పత్రాలతో రూ.15 కోట్ల ప్లాట్లు స్వాహా

ముగ్గురు నిందితులకు రిమాండ్‌

సంగారెడ్డి క్రైం, మే 1: నకిలీ పత్రాలతో పాటు నకిలీ వంశస్తులను కూడా సృష్టించి కోట్ల విలువైన ప్లాట్లను స్వాహా చేస్తున్న ఓ ముఠా గుట్టును జిల్లా సీసీఎస్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ వివరాలను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్‌ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన బండి దుర్గాప్రసాద్‌, సుబ్బారావు, రవిగౌడ్‌ ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమీన్‌పూర్‌ పరిధిలోని రామేశ్వరం బండ ప్రాంతంలో 25 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి, ఆ ప్లాట్ల అసలు యజమాని వివరాలు తెలుసుకొని వారి పేరు మీద నకిలీ ఆధార్‌, సేల్‌ డీడ్‌, లింకు డాక్యుమెంట్లను తయారు చేసేవారు. ఆ తర్వాత సదరు ప్లాట్ల యజమానికి సరిపడా వయస్సు ఉన్న వ్యక్తులను ఎంచుకుని వారి డబ్బులిచ్చి, రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి రప్పించి సంతకాలు చేయించేవారు. ఇలా మొత్తం 15 నుంచి 20 ప్లాట్లను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఈ కేసులో నిందితులైన బండి దుర్గాప్రసాద్‌, సుబ్బారావు, రవిగౌడ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రూపేష్‌ తెలిపారు. ఈ ముఠాకు సహకరించిన రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 05:10 AM