Share News

14 సీట్లు పక్కా!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:17 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను కాంగ్రెస్‌ పక్కాగా గెలిచే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల పేర్లను త్వరితగతిన అధిష్ఠానానికి నివేదించాలని సూచించారు.

14 సీట్లు పక్కా!

లోక్‌సభ ఎన్నికల పోరు మొదలైనట్లే.. ప్రచార వ్యూహాలకు పదును పెట్టండి

తెలంగాణ కో ఆర్డినేటర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను కాంగ్రెస్‌ పక్కాగా గెలిచే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల పేర్లను త్వరితగతిన అధిష్ఠానానికి నివేదించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైనట్లేనని, ఇక ప్రచార వ్యూహాలకు పదును పెట్టాలని నేతలకు సూచించారు. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ లోక్‌సభ కో ఆర్డినేటర్లతో ఖర్గే సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీలోని వివిధ స్థాయిల్లోని నేతలు చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి నేతలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఖరే..్గ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి నేతలకు

కీలక సూచనలు చేశారు. ప్రచారంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌, ప్రజలతో మమేకం ఎలా అవ్వాలన్నదానిపై మార్గనిర్దేశనం చేశారు. ఎన్నికల విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసినట్లుగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆదేశించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మెజారిటీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సోనియాగాంధీని తెలంగాణలో పోటీ చేయాలని అభ్యర్థించినట్లు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికలలో పునరావృతమవుతాయన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని 3లక్షల మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్‌ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 14 సీట్లలో పార్టీకి విజయవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ 70 సీట్లలో గెలుపోందుతుందని తానే మొదట చెప్పానన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లను గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు. రెండు మూడు స్థానాలకోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. దేశానికి కాంగ్రెస్‌ నాయకత్వం అవసరమని మంత్రి సీతక్క చెప్పారు. అదిలాబాద్‌లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. అభ్యర్థి ఎవరైనా అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు. హైకమాండ్‌ సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకుకెళాతామని మంత్రి కొండా సురేఖ చెప్పారు.

ఏపీ కోఆర్డినేటర్లతో ఖర్గే భేటీ

తెలంగాణ నేతలతో సమావేశ అనంతరం ఖర్గే ఏపీ లోక్‌సభ స్థానాల కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రానుండటంతో మెజారిటీ స్థానాలలో గెలుపొందేందుకు కృషిచేయాలని ఏపీ నేతలకు ఖర్గే సూచించారు. ఏపీలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఏపీలో పార్టీ పుంజుకుంటోందని, షర్మిల రాకతో పరిస్థితి మరింత ఊపు వచ్చిందని నేతలు ఖర్గేకు వివరించారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీరెడ్డి మాట్లాడుతూ.. కలిసొచ్చే వాళ్లతో ఆంధ్రప్రదేశ్‌లోనూ పొత్తులుంటాయని స్పష్టం చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 07:01 AM