Share News

బైక్‌పై 126 గొర్రెలా? ఎలా సాధ్యం?

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:54 AM

గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మోటారు సైకిల్‌పై ఒకేసారి 126 గొర్రెలను తరలించడం

బైక్‌పై 126 గొర్రెలా? ఎలా సాధ్యం?

ఆ మోటార్‌ సైకిల్‌ ఏ కంపెనీదో తెలుసుకోవాలి

బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రం

గొర్రెల స్కీమ్‌లో అక్రమాలపై చర్యలుంటాయని స్పష్టీకరణ

‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రస్తావిస్తూ శాసనసభలో ప్రకటన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మోటారు సైకిల్‌పై ఒకేసారి 126 గొర్రెలను తరలించడం ఎలా సాధ్యమైందో? అంటూ పరోక్షంగా బీఆర్‌ఎ్‌సపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘బైక్‌పై ఒకేసారి 126 గొర్రెలట!’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో జీరో అవర్‌ నిర్వహించగా, ఇద్దరు సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చాలా మంది యాదవులు గొర్రెల పంపిణీ పథకం కోసం తమ వాటాధనం కింద రూ.43,750 చొప్పున చెల్లించారని తెలిపారు. ఇప్పటివరకు వారికి యూనిట్లు మంజూరు కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ బైక్‌పై 120 గొర్రెలను తీసుకెళ్లారంటూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిందని, దీనిపై ప్రభుత్వం ఏం చేయదల్చుకున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని చూపిస్తూ మాట్లాడారు. ‘‘ఎన్నికలకు ముందు గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం చాలా మంది యాదవులు వడ్డీలకు తెచ్చి తమ వాటా సొమ్మును ప్రభుత్వానికి చెల్లించారు. ఆరు నెలలకు ముందు డబ్బు కట్టించుకున్న వారికి కూడా గొర్రెల యూనిట్లను ఇవ్వలేదు. బైక్‌పై ఒకేసారి 126 గొర్రెలను తీసుకెళ్లినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. అది ఏ మోటారు సైకిలో, ఏ కంపెనీదో తెలుసుకోవాల్సి ఉంది. ఈ పథకంలో జరిగిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే యాదవులకు గొర్రెల యూనిట్లు అందజేస్తాం’’ అని స్పష్టం చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 03:54 AM