Share News

CM Revanth : 12 సీట్లు గెలవాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:06 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో గెలిపించుకుందామని టీపీసీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

CM Revanth : 12  సీట్లు గెలవాలి

అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ పిలుపు

ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా

వారంలో మూడు రోజులు సాయంత్రం కలుస్తా

ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన చేపడతా

ముఖ్యమంత్రిగా తొలి సభ ఇంద్రవెల్లిలో..

అమరుల స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన

సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ కమిటీలు వేస్తాం

ప్రభుత్వంతో పనులు చేయిస్తానంటూ ప్రజల

వద్ద ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు

ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం: రేవంత్‌

ఐదు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో

సీఎం భేటీ.. లోక్‌సభ ఎన్నికలపై సమీక్ష

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో గెలిపించుకుందామని టీపీసీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. సోమవారం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఐదు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 తర్వాత తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచే పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తన తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించానని, ముఖ్యమంత్రిగానూ తొలి సభను అక్కడే నిర్వహిస్తానని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్మృతివనం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదిలాబాద్‌ జిల్లా నేతలకు సూచించారు. కాగా, తాను గత ముఖ్యమంత్రిలా కాదని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని రేవంత్‌ అన్నారు. ఈ నెల 26 తర్వాత.. ఎమ్మెల్యేలను కలిసేందుకు వారంలో మూడు రోజులు ప్రత్యేకంగా కేటాయించుకుంటానని తెలిపారు. ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు చూస్తారని చెప్పారు.

సంక్రాంతి తరువాత ఇందిరమ్మ కమిటీలు..

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సంక్రాంతి పండుగ తరువాత ఇందిరమ్మ కమిటీలను వేస్తామని, ఆ కమిటీల్లో పార్టీ కార్యకర్తలనూ భాగస్వాములను చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి పనులు చేయిస్తానంటూ డబ్బులు తీసుకోవడం, అవినీతికి పాల్పడడం వంటి వాటిని సహించేది లేదని, ఈ మేరకు పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని కూడా చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలను ఉపేక్షించబోనని రేవంత్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ సమీక్షలో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. మిగిలిన ఐదు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు.

అన్నా...అని పిలువగానే ఆగిన సీఎం ఇంటి వద్ద కారు దిగి వచ్చి విజ్ఞప్తుల స్వీకరణ

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అన్నా అని పిలువగానే కారు దిగివచ్చి మరీ విజ్ఞప్తులను స్వీకరించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటి వద్దకు సోమవారం ఉదయం కొందరు వచ్చారు. ఆయన ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వెళ్లనివ్వలేదు. దీంతోవిజ్ఞాపన పత్రాలతో వచ్చిన కొందరు మహిళలు, మరికొందరు సీఎం ఇంటి సమీపంలో వేచి ఉన్నారు. సచివాలయానికి సీఎం కాన్వాయ్‌ వెళ్తుండగా.. అన్నా అంటూ పిలిచారు. అంతే.. కాన్వాయ్‌ని ఆపమని చెప్పారు సీఎం. కారు దిగి భద్రతను పక్కన పెట్టి మరీ అక్కడున్న మహిళలు, మరికొందరిని కలిసి విజ్ఞాపన పత్రాలను తీసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. పలువురితో కరచాలనం చేశారు. దీంతో అక్కడున్న వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పక్క భవనంపై నుంచి ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది పెద్దఎత్తున వైరల్‌ అవుతోంది. ‘ఇది కదా తెలంగాణ స్వేచ్ఛ’ అని, ‘పిలిస్తే పలికే సీఎం’ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 04:06 AM