Share News

మెట్రోకు రూ.1000 కోట్లు!

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:18 AM

రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఏయూడీ)కు కేటాయించిన రూ.11వేల కోట్లలోంచి మెట్రో విస్తరణకు రూ.1000 కోట్లు కేటాయించినట్లు

మెట్రోకు రూ.1000 కోట్లు!

ఎంఏయూడీ కేటాయింపుల నుంచే అందజేత!

రెండు, మూడు రోజుల్లో ప్రకటించనున్న మెట్రో అధికారులు

సర్కారు నుంచి 35ు నిధులు.. జైకా నుంచి 45% రుణం

మరో 15 శాతం కేంద్ర సాయం.. 5% పీపీపీకి అప్పగింత?

డీపీఆర్‌ను పూర్తి చేసే పనిలో హెచ్‌ఎంఆర్‌ అధికారులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఏయూడీ)కు కేటాయించిన రూ.11వేల కోట్లలోంచి మెట్రో విస్తరణకు రూ.1000 కోట్లు కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని హైదరాబాద్‌ మెట్రో అధికారులు రెండు, మూడు రోజుల్లో వెల్లడించనున్నారు. నగరంలో మొదటి దశ కింద ఎల్‌బీనగర్‌- మియాపూర్‌, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో 70 కిలోమీటర్లను ప్రతిపాదిస్తే.. 69.2 కిలోమీటర్లను పూర్తిచేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో దశ కింద రాయ దుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కిలోమీటర్లు), బీహెచ్‌ఈఎల్‌-లక్డీకపూల్‌ (26 కిలోమీటర్లు), నాగోలు-ఎల్‌బీనగర్‌ (5 కిలోమీటర్లు) ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ప్రతిపాదించిన పనులను పక్కన పెట్టింది. ప్రజా రవాణాను పెంపొందించే మార్గాలను పరిశీలించారు. ఇందులో భాగంగా మొదటి దశలో మిగిలిన ఎంజీబీఎ్‌స-ఫలక్‌నుమా (5.5 కిలోమీటర్లు)తోపాటు ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు (1.5 కిలోమీటర్లు), నాగోలు-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (29 కిలోమీటర్లు), మైలార్‌దేవ్‌పల్లి-న్యూ హైకోర్టు (4 కిలోమీటర్లు), రాయదుర్గం-అమెరికన్‌ కాన్సులేట్‌ (8 కిలోమీటర్లు), మియాపూర్‌-పటాన్‌చెరు (14 కిలోమీటర్లు), ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ (8 కిలోమీటర్లు) పనులను ఖరారు చేశారు.

మొత్తంగా రెండో దశ విస్తరణ కింద 70 కిలోమీటర్లను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉండగా... మరో 15 శాతం కేంద్రం నుంచి తీసుకోనుందని, జైకా సంస్థ నుంచి 45 శాతం రుణాలు సేకరించనుందని ఓ అధికారి తెలిపారు. మిగతా 5 శాతం పీపీపీకి ఇవ్వనుందని చెప్పుకొచ్చారు. రూ.17,500 కోట్లతో చేపట్టనున్న భారీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రుణాల సేకరణ చేయడం తప్పదని, ఇలా చేయడం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతోందన్నారు. సకాలంలో పనులను కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. వచ్చేనెలలోపు డీపీఆర్‌ను పూర్తి చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం పొందాక అనుమతి కోసం కేంద్రానికి పంపిస్తారని, అనుమతి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పనులు మొదలవుతాయని తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 04:18 AM