Share News

100 కోట్లు హాంఫట్‌!

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:08 AM

కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంట్లను మూసేయాలన్న కేంద్రం ఆదేశాలు.. అక్రమార్కులకు వరంగా మారాయి. తుక్కు కింద ఏకంగా రూ.100కోట్లకుపైగా చేతులు మారగా.. ఓ కీలక అధికారికి రూ.15కోట్లదాకా ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

100 కోట్లు హాంఫట్‌!

తుక్కుపేరిట తినేశారు

కేటీపీఎస్‌లోని పాత విద్యుత్తు ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం

నిబంధనలు పట్టించుకోని అధికారులు.. టెండరు పొందిన సంస్థదే ఇష్టారాజ్యం

8 కిలోమీటర్ల మేర పైపు లైన్లు మాయం.. విలువైన కేబుళ్లను తరలించేసిన సంస్థ

కీలక అధికారికి రూ.15కోట్ల ముడుపులు.. ఇందులో మరో నలుగురు అధికారుల పాత్ర

2030దాకా పాత ప్లాంట్లను కూల్చొద్దని కేంద్రం ఆదేశించినా హడావుడిగా ఉత్తర్వులు

హైదరాబాద్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంట్లను మూసేయాలన్న కేంద్రం ఆదేశాలు.. అక్రమార్కులకు వరంగా మారాయి. తుక్కు కింద ఏకంగా రూ.100కోట్లకుపైగా చేతులు మారగా.. ఓ కీలక అధికారికి రూ.15కోట్లదాకా ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో సదరు అధికారితోపాటు మరో నలుగురు కీలక పాత్ర పోషించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(కేటీపీఎ్‌స)లో 480 మెగావాట్ల సామర్థ్యం(ఒక్కోటి 120 మెగావాట్లు కలిగిన నాలుగు యూనిట్లు), 240 మెగావాట్ల సామర్థ్యం(ఒక్కోటి 60 మెగావాట్లు కలిగిన నాలుగు యూనిట్ల)ఉన్న ప్లాంట్లను నిర్మించి 30 ఏళ్లు దాటింది. దీంతో వాటిని మూసేయాలని 2018ఏప్రిల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2019 తర్వాత కాలం చెల్లిన ప్లాంట్లు నడపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి కేటీపీఎస్‌ ఏడో దశ 800మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ విద్యుత్తు కేంద్రానికి అనుమతినిచ్చిన సందర్భంలోనే 30ఏళ్లు దాటిన ప్లాంట్లన్నీ మూసివేయాలని కేంద్రం ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. వీటిలో కాలుష్య ఉద్గారాలు తగ్గించే అవకాశాలు లేకపోవడం, అది కూడా అధిక వ్యయంతో కూడుకున్న పని కావడంతో వీటికి తాళం వేయడమే మేలని తెలంగాణ జెన్‌కో నిర్ణయానికి వచ్చింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉండడంతో 2019 డిసెంబరు నాటికి రెండు ప్లాంట్లను మూసివేసింది. పనిలో పనిగా మూసివేసిన ప్లాంట్లను తుక్కు రూపంలో విక్రయించేందుకు 2023 జూన్‌లో టెండర్లు పిలిచింది. వాస్తవానికి ప్లాంట్‌లోని మెకానికల్‌ సామగ్రితోపాటు ప్లాంట్‌ లోపల ఉన్న పైపులు, కేబుళ్లు, కన్వేయర్స్‌, షెడ్‌, ఐరన్‌ నిర్మాణాలు, స్టోర్‌లోని పరికరాలు, సివిల్‌ నిర్మాణాలను తుక్కుగా విక్రయించడం ద్వారా రూ.449కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో అంచనా వేసింది. అయితే, ఈ టెండరును రూ.485 కోట్లకు దక్కించుకున్న సంస్థ... టెండర్‌ పరిధిలో లేని కాపర్‌, అల్యూమినియంతోపాటు ఇనుమును తరలించింది. ఈ వ్యవహారంలో రూ.100కోట్ల దాకా చేతులు మారినట్లు తేలింది.

టెండర్‌లో లేకున్నా...

టెండర్‌ నిబంధనల ప్రకారం ప్లాంట్‌ ఉన్న స్థలంలోనే తవ్వకాలు జరిపి.. తుక్కును తరలించాల్సి ఉంది. అయితే, టెండరు దక్కించుకున్న సంస్థ ఇష్టారాజ్యంగా సామగ్రిని తరలించేసింది. ఈ ప్లాంట్ల నుంచి బూడిద వాగు చెరువు దాకా సుమారు 8 కిలోమీటర్ల మేర మూడు వరుసల్లో ఉన్న పైపులైన్లను తరలించేసింది. నిబంధనల ప్రకారం ఈ పైపులను ముట్టుకోకూడదు. అంతేకాదు.. ప్లాంట్‌ పునాది(ఫౌండేషన్‌)లో ఉన్న పరికరాలను కూడా ముట్టుకోరాదని టెండర్‌ నిబంధనల్లో ఉంది. కానీ, భూగర్భంలో ఎర్తింగ్‌ కోసం పరిచిన 3 నుంచి 4 ఇంచుల డయా కలిగిన కాపర్‌, అల్యూమినియం కేబుళ్లు కూడా మాయం చేసినట్లు తేలింది. అక్రమంగా తరలించిన ఈ పైపులు, కేబుళ్ల విలువే రూ.100కోట్లకుపైగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇందులో ఓ కీలక అధికారికి రూ.15కోట్ల మేర అందగా, మరో నలుగురు అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు.. 2019 డిసెంబరులో రెండు ప్లాంట్లు మూతపడగా... బూడిద పైపులు, ప్లాంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు చెందిన కాపర్‌, బస్‌ బార్స్‌, ఎయిర్‌ కండీషనర్లతో పాటు రూ.12కోట్ల విలువైన బేరింగ్స్‌ను కీలక అధికారి నేతృత్వంలోని నలుగురు అధికారులు బృందంగా ఏర్పడి, అమ్ముకున్నట్లు తెలిసింది. రెండు ప్లాంట్ల పరిధిలో 250-300 చెట్లు ఉండగా... అనుమతి లేకుండా నరికేసి, కలపను అమ్ముకున్నట్లు సమాచారం. ప్లాంట్‌ పరిధిలో జంగిల్‌ (మొక్కలను కట్‌ చేయించే) పేరిట కూడా రూ.80 లక్షల దాకా తిన్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఆదరాబాదరాగా ఉత్తర్వులు

దేశంలో విద్యుత్తు డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యుదుత్పత్తి నిలిపివేసిన ప్లాంట్లను సైతం ఇప్పటికిప్పుడు కూల్చివేయరాదని కేంద్ర విద్యుత్తు శాఖ 2023 జనవరి 30న రాష్ట్రాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న 81 (30 ఏళ్లు దాటిన)ప్లాంట్లను 2030 దాకా కూల్చివేయొద్దని సూచించింది. అయితే, కేంద్రం ఆదేశాలు వెలువడిన ఆర్నెల్ల తర్వాత అంటే 2023 జూన్‌ 8న కేటీపీఎస్‌ పరిధిలోని రెండు ప్లాంట్లను తుక్కు కింద అమ్మేయడానికి తెలంగాణ జెన్‌కో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాల జారీ వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు డిమాండ్‌

Updated Date - Apr 03 , 2024 | 03:10 AM