Share News

10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే!

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:46 AM

లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో రెండంకెల స్థానాలు సాధించడమే ధ్యేయంగా ముందుకెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటుబ్యాంకు గణనీయంగా పెరిగిందని

10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే!

రాష్ట్రంలో రెండంకెల స్థానాలపై కమలం గురి

కచ్చితంగా 10 సీట్లు.. 35 శాతం ఓట్లే లక్ష్యం

మోదీ హవా, ‘అయోధ్య’ కలిసొస్తుందన్న ధీమా

కేటగిరీలుగా పార్లమెంటు నియోజకవర్గాల విభజన

మెజారిటీ సీట్లిస్తే రాష్ట్రాభివృద్ధిలో తమదైన ముద్ర

చూపుతామంటూ బీజేపీ నేతల ప్రచారం

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో రెండంకెల స్థానాలు సాధించడమే ధ్యేయంగా ముందుకెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఓటుబ్యాంకు గణనీయంగా పెరిగిందని భావిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం.. ఈ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ కచ్చితంగా సాధిస్తామన్న ధీమాతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 స్థానాలు కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో పనిచేస్తోంది. ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు, 35 శాతం ఓట్లు సాధించాలని పార్టీ అగ్రనేత అమిత్‌ షా ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ ముఖ్యనేతలకు నిర్దేశించిన సంగతి తెలిసిందే. కచ్చితంగా 10 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి స్పష్టం చేసింది. ప్రధాని మోదీ హవాతో పాటు అయోధ్య రామమందిరం అంశం తమకు బాగా కలిసొస్తాయని భావిస్తున్న అధిష్ఠానం.. తమ లక్ష్యాన్ని సాధించేందుకు అంతర్గత కసరత్తు ముమ్మరం చేస్తోంది. కచ్చితంగా గెలిచే నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. వీలైనంత ఎక్కువగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల పర్యటనలు ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో కేడర్‌ను మరింత క్రియాశీలం చేయడం, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించడం, సామాజికంగా ప్రభావితం చేసే ప్రముఖులు, ఆయా వర్గాల ముఖ్యులతో విస్తృత భేటీలు వంటి కార్యక్రమాలను చేపడుతోంది. మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, నియోజకవర్గాలవారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రచారం కూడా ఉధృతం చేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన తాము, కొద్దిరోజులకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకోవడంతో పాటు 20 శాతం ఓట్లు సాధించామని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించడంతో పాటు 14 శాతం ఓట్లు వచ్చాయని, ఎంపీ ఎన్నికల్లో మోదీ హవాతో ఈ ఓటుబ్యాంకు 35 శాతానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మెజారిటీ సీట్లిస్తే..

కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో తమకు ఎక్కువ సీట్లిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతమవుతాయని కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. నలుగురు ఎంపీలను గెలిపిస్తేనే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధిలో తమదైన ముద్ర చూపిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.

లక్ష్యం.. 35 శాతం ఓట్లు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్లలో కనీసం 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. ఈ దిశగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సీనియర్‌ నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. ప్రతి రెండు, మూడు సెగ్మెంట్లకు ఒక జాతీయ స్థాయి నేత ఈ విధులు నిర్వహించనున్నారు. దీంతో పాటు 32 విభాగాలతో రాష్ట్రస్థాయి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీని 8 క్లస్టర్లుగా విభజించి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రధాని మోదీకి జనాదరణ పెరిగిందని, ఇది తమ విజయావకాశాలను మరింత మెరుగుపరుస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

చేరికలతో మరింత బలోపేతం!

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, కేడర్‌ చేరికలతో తాము మరికొంత బలపడినట్లు బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గడిచిన కొద్దిరోజుల్లో ఇద్దరు బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీలతో పాటు పలువురు సీనియర్‌ నేతలు కాషాయ కండువాలు కప్పుకొన్న సంగతి తెలిసిందే. దీంతో తమకున్న సంప్రదాయ ఓటుబ్యాంకుకు వీరి చేరిక అదనపు బలం అవుతుందని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. మరోవైపు 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ బలం, బలహీనతలను పరిగణనలోకి తీసుకున్న నాయకత్వం.. వాటిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. గట్టి పట్టున్నట్లుగా భావిస్తున్న 10 పార్లమెంటు నియోజకవర్గాలను కేటగిరీ ‘ఏ’లో చేర్చింది. గత ఎన్నికల్లో గెలుచుకున్న కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, ఆదిలాబాద్‌తో పాటు చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరి, మెదక్‌, భువనగిరి నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. వరంగల్‌, నాగర్‌కర్నూలును ‘బి’ కేటగిరీలో చేర్చింది. మిగతా ఐదింటిని ‘సి’ కేటగిరీలో చేర్చారు. జహీరాబాద్‌ సిటింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బీజేపీలో చేరడంతో ఆయన సామాజికవర్గం ఓటుబ్యాంకు తమకు అదనపు బలం అవుతుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన డీకే అరుణ, ఈసారి కచ్చితంగా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఆమె విస్తృత ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా పట్టున్న ఇతర పార్టీల నేతలను ఆమె బీజేపీలో చేర్చుకుంటున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 05:46 AM