Share News

యువహో.. జయహో

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:08 AM

బజ్‌బాల్‌ గేమ్‌తో ఇంగ్లండ్‌ జట్టు ప్రపంచ క్రికెట్‌లో సుకెళ్తుండవచ్చు గాక.. కానీ భారత గడ్డపై వారి ఆటలు సాగవని యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా నిరూపించింది. స్టార్లు లేకపోయినా, ఏకంగా ఐదుగురు అరంగేట్రం చేసి..

యువహో.. జయహో

ఇన్నింగ్స్‌ 64 రన్స్‌తో భారత్‌ విజయం

  • 4-1తో సిరీస్‌ కైవసం

  • అశ్విన్‌కు ఐదు వికెట్లు

  • ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ చిత్తు

బజ్‌బాల్‌ గేమ్‌తో ఇంగ్లండ్‌ జట్టు ప్రపంచ క్రికెట్‌లో సుకెళ్తుండవచ్చు గాక.. కానీ భారత గడ్డపై వారి ఆటలు సాగవని యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా నిరూపించింది. స్టార్లు లేకపోయినా, ఏకంగా ఐదుగురు అరంగేట్రం చేసి.. ఇంగ్లండ్‌కు ఈ ఐదు టెస్టుల సిరీస్‌ను ఓ పీడకలగా మార్చారు. నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో స్టోక్స్‌ సేన పసికూనలా తడబడింది. మూడో రోజు పూర్తిగా ఆడకుండానే రెండు సెషన్లకే చాప చుట్టేసింది. వందో టెస్టు ఆడిన అశ్విన్‌ మొత్తంగా 9 వికెట్లతో వహ్వా.. అనిపించాడు.

ధర్మశాల: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీ్‌సకు భారత జట్టు అదిరే ముగింపునిచ్చింది. ఆఖరి టెస్టులో కేవలం రెండున్నర రోజుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన అశ్విన్‌.. మొత్తంగా 9 వికెట్లతో కెరీర్‌లో వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. అలాగే జట్టు వరుసగా నాలుగు విజయాలతో సిరీ్‌సను 4-1తో దక్కించుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో మాత్రమే ఇంగ్లండ్‌ నెగ్గింది. వారి బజ్‌బాల్‌ శకంలో సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. మరోవైపు ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 700 వికెట్ల మైలురాయిని చేరుకుని టెస్టుల్లో మురళీధరన్‌, షేన్‌వార్న్‌ తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన మూడో ఆటగాడయ్యాడు. శనివారం మూడో రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 477 పరుగుల వద్ద ముగించింది. తొలి సెషన్‌లో కేవలం నాలుగు పరుగులే జత చేసి కుల్దీప్‌ (30), బుమ్రా (20) అవుటయ్యారు. దీంతో జట్టుకు 259 పరుగుల ఆధిక్యం లభించింది. స్పిన్నర్‌ బషీర్‌కు ఐదు, అండర్సన్‌.. హార్ట్‌లీకి రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం దక్కింది. రూట్‌ (84), బెయిర్‌స్టో (39) మాత్రమే రాణించారు. బుమ్రా, కుల్దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కుల్దీప్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా జైస్వాల్‌ నిలిచారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసింది. వెన్ను నొప్పి కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ మూడో రోజు ఆటలో బరిలోకి దిగలేదు. దీంతో బుమ్రా బాధ్యతలు తీసుకున్నాడు.

అశ్విన్‌ ఆరంభం నుంచే..: మూడో రోజు ఆట ఆరంభమైన 20 నిమిషాల్లోనే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ సంతోషంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ ఫ్లాట్‌ వికెట్‌పై చెలరేగుతుందేమో అనిపించింది. కానీ స్పిన్నర్లను ఎదుర్కోవడమే రాదన్నట్టుగా టపటపా వికెట్లను కోల్పోతూ పెవిలియన్‌ చేరారు. జో రూట్‌ మాత్రమే ఎదురొడ్డి నిలిచి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. రెండో ఓవర్‌లోనే అశ్విన్‌ వికెట్ల పతనాన్ని ఆరంభించి టాపార్డర్‌ పనిబట్టాడు. డకెట్‌ (2), క్రాలే (0), పోప్‌ (19) వికెట్లను అశ్విన్‌ తీయగా.. బెయిర్‌స్టో ఉన్న కాసేపు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. కానీ కుల్దీప్‌ అద్భుత బంతికి అతను ఎల్బీగా వెనుదిరిగాడు. స్టోక్స్‌ (2), అశ్విన్‌ ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో జట్టు తొలి సెషన్‌ ముగిసేసరికే 103/5తో దయనీయంగా కనిపించింది.

వికెట్లు టపటపా: భారత్‌ ఆధిక్యానికి 157 పరుగులు వెనుకబడిన దశలో రెండో సెషన్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ వేగంగా మిగిలిన 5 వికెట్లను కోల్పోయింది. ఆరంభంలోనే ఫోక్స్‌(8)ను అవుట్‌ చేసిన అశ్విన్‌ తన ఐదు వికెట్లను పూర్తి చేశాడు. హార్ట్‌లీ (20), ఉడ్‌ (0)లను బుమ్రా వరుస ఓవర్లలో దెబ్బతీయడంతో జట్టు 141/8 స్కోరుతో నిలిచింది. ఈ దశలో రూట్‌కు బషీర్‌ (13) సహకారమందించగా తొమ్మిదో వికెట్‌కు 48 పరుగులు జత చేరాయి. కానీ బషీర్‌ను జడేజా, సెంచరీ దిశగా సాగుతున్న రూట్‌ను కుల్దీప్‌ స్వల్ప వ్యవధిలోనే అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసింది.

భారత్‌ 579 టెస్టులు ఆడగా, ఇందులో విజయాలు (178), ఓటములు (178) సమానం కావడం ఇదే తొలిసారి. 222 మ్యాచ్‌లు డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది.

ఐదు టెస్టుల సిరీ్‌సలోని తొలి టెస్టులో ఓడి వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గడం ఏ జట్టుకైనా 112 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 1911-12లో ఇంగ్లండ్‌ జట్టు ఆస్ర్టేలియాపై ఇలా గెలిచింది.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 218;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 477.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (సి) సర్ఫరాజ్‌ (బి) అశ్విన్‌ 0; డకెట్‌ (బి) అశ్విన్‌ 2; పోప్‌ (సి) జైస్వాల్‌ (బి) అశ్విన్‌ 19; రూట్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 84; బెయిర్‌స్టో (ఎల్బీ) కుల్దీప్‌ 39; స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 2; ఫోక్స్‌ (బి) అశ్విన్‌ 8; హార్ట్‌లీ (ఎల్బీ) బుమ్రా 20; ఉడ్‌ (ఎల్బీ) బుమ్రా 0; బషీర్‌ (బి) జడేజా 13; అండర్సన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 48.1 ఓవర్లలో 195 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-2, 2-21, 3-36, 4-92, 5-103, 6-113, 7-141, 8-141, 9-189, 10-195. బౌలింగ్‌: బుమ్రా 10-2-38-2; అశ్విన్‌ 14-0-77-5; జడేజా 9-1-25-1; కుల్దీప్‌ 14.1-0-40-2; సిరాజ్‌ 1-0-8-0.

1

టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అండర్సన్‌. ఓవరాల్‌గా మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (709) తర్వాత నిలిచాడు.

1

టెస్టుల్లో ఎక్కువ సార్లు (36) 5+ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా హ్యాడ్లీ సరసన నిలిచిన అశ్విన్‌. మురళీధరన్‌ (67), షేన్‌ వార్న్‌ (37) టాప్‌లో ఉన్నారు.

3

భారత్‌ తరఫున ఎక్కువ సార్లు (36) 5+ వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌. కుంబ్లే (35)ను దాటేశాడు. అలాగే వందో టెస్టులో ఉత్తమ గణాంకాలు (9/128) నమోదు చేసిన బౌలర్‌గా.. రెండు ఇన్నింగ్స్‌లోనూ 4+ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గానూ నిలిచాడు. అంతేకాదు.. అరంగేట్ర టెస్టుతో పాటు వందో టెస్టులోనూ ఐదు వికెట్లు తీసిన బౌలర్‌ అతనొక్కడే కావడం విశేషం.

Updated Date - Mar 10 , 2024 | 06:08 AM