వారెవా.. నితీశ్
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:22 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీ్‌సలో అరంగేట్రం చేసిన టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకొంటున్నాడు. ఆసీ్‌సతో జరిగిన రెండు టెస్టుల్లోనూ 41, 38 నాటౌట్, 42, 42 పరుగులు సాధించిన నితీశ్....
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీ్‌సలో అరంగేట్రం చేసిన టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకొంటున్నాడు. ఆసీ్‌సతో జరిగిన రెండు టెస్టుల్లోనూ 41, 38 నాటౌట్, 42, 42 పరుగులు సాధించిన నితీశ్.. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక (7) సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో సెహ్వాగ్ (2003-04 సిరీస్‌లో 6 సిక్సర్లు) రికార్డును అధిగమించాడు. ప్యాట్ కమిన్స్, బొలాండ్ బౌలింగ్‌లో రెండేసి సిక్స్‌లు కొట్టిన నితీశ్.. మార్ష్, స్టార్క్ బౌలింగ్‌లో చెరొకటి సాధించాడు. పెర్త్ టెస్టులో లబుషేన్ బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టిన నితీశ్ మొత్తంగా ఈ టూర్‌లో ఏడు సిక్స్‌లు ఖాతాలో వేసుకొన్నాడు. అయితే, ఓవరాల్‌గా చూస్తే ఆస్ర్టేలియా గడ్డపై రిషభ్ పంత్ (9 టెస్టుల్లో 10 సిక్సర్లు), రోహిత్ శర్మ (8 టెస్టుల్లో 10), సెహ్వాగ్ (8) అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాళ్లలో టాప్-3లో ఉన్నారు.
ముఖ్యంగా లోయరార్డర్‌లో పవర్‌ఫుల్ షాట్లతో నితీశ్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. బంతి ఎంత వేగంగా వస్తే.. అంత వేగంగా షాట్లు ఆడడం అతడి ప్రత్యేకత. ఇక, నితీశ్ లాఫ్టెడ్ షాట్లు 60 కిమీ వేగంతో వెళ్లడం కామెంటేటర్లనే ఆశ్చర్యపర్చింది. అంతేకాకుండా ఆడిన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లో మూడుసార్లు అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్‌గా.. సునీల్ గవాస్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 1971లో అరంగేట్రం చేసిన గవాస్కర్ తొలి టెస్టులో 65, 67 పరుగులు.. రెండో టెస్టులో 116, 64 నాటౌట్ స్కోరు చేశాడు. 53 ఏళ్ల తర్వాత నితీశ్ అంతటి ఘనతను అందుకొన్నాడు.