Share News

WPL : తగ్గేదేలె..

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:09 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి ముంబైకు సంచలన విజయం అందించిన కేరళ క్రికెటర్‌ సజన..ఆ ప్రదర్శనతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. అయితే, ఆమె ఈస్థాయికి రావడం వెనుక ఎంతో

WPL : తగ్గేదేలె..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి ముంబైకు సంచలన విజయం అందించిన కేరళ క్రికెటర్‌ సజన..ఆ ప్రదర్శనతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. అయితే, ఆమె ఈస్థాయికి రావడం వెనుక ఎంతో పట్టుదల, శ్రమ దాగుంది. 29 ఏళ్ల సజనది వాయనాడ్‌లోని మనంతవాడి గ్రామం. తండ్రి సజీవన్‌ ఆటోడ్రైవర్‌. అరకొర ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టమైనా.. కుమార్తె ఆసక్తిని గమనించిన తండ్రి ఆమెను క్రికెట్‌లో ప్రోత్సహించాడు. 2013లో కేరళ క్రికెట్‌ సంఘం అకాడమీలో సీటు సంపాదించిన సజన.. అంతర్‌ జిల్లా అండర్‌-19 టోర్నీలో రాణించడం ఆమె కెరీర్‌కు మలుపు. హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాటర్‌, ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా కేరళ అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకొన్న ఆమె.. వెంటనే సారథిగా జట్టు పగ్గాలందుకొంది. ఈ క్రమంలో తన ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో వేగవంతమైన శతకం బాది రికార్డు సృష్టించింది. కేరళకు అండర్‌-23 టీ20 టైటిల్‌ అందించడంలో కీలకపాత్ర పోషించింది. భారత్‌-ఎ తరఫున సత్తాచాటింది. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న దశలో.. 2018లో వచ్చిన వరదల్లో తన ఇల్లు కొట్టుకుపోవడం, కరోనా సమయంలో అనారోగ్యానికి గురవడంలాంటి ఎన్నో సమస్యలు చుట్టు ముట్టినా సజన మనోధైర్యంతో నిలబడింది. తొలి డబ్ల్యూపీఎల్‌ వేలంలో ఏ జట్టూ తనను తీసుకోకపోయినా నిరాశపడకుండా ఆటపైనే దృష్టి సారించింది. ఈసారి వేలంలో ముంబై జట్టు కు ఎంపికైంది. ఇక, ఆరంభ మ్యాచ్‌లోనే తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌ బాది ముంబైని గెలిపించిన సజనను సహచరులంతా తమ జట్టు ‘పొలార్డ్‌’ అం టూ ప్రశంసిస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆటలో మాత్రం తగ్గేదేలె అన్నట్టుగా సజన దూసుకెళుతోంది.

Updated Date - Feb 25 , 2024 | 05:09 AM