Share News

ఈసారైనా అందేనా?

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:40 AM

బ్యాడ్మింటన్‌లో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌పనకున్న హోదా, గుర్తింపు వేరు. ప్రతీ షట్లర్‌ ఈ టైటిల్‌ కోసం పరితపిస్తుంటాడు.

ఈసారైనా అందేనా?

కళ్లన్నీ సాత్విక్‌-చిరాగ్‌ పైనే..

స్టోర్ట్ప్‌ 18, జియో

సినిమాలో మధ్యాహ్నం 3.30 నుంచి

నేటినుంచి

‘ఆల్‌ ఇంగ్లండ్‌’ బ్యాడ్మింటన్‌

బర్మింగ్‌హామ్‌: బ్యాడ్మింటన్‌లో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌పనకున్న హోదా, గుర్తింపు వేరు. ప్రతీ షట్లర్‌ ఈ టైటిల్‌ కోసం పరితపిస్తుంటాడు. భారత్‌ తరఫున దశాబ్దాల క్రితం ప్రకాశ్‌ పడుకోన్‌ (1980), పుల్లెల గోపీచంద్‌ (2001) మాత్రమే విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత 23 ఏళ్లుగా భారత షట్లర్లు ఏ విభాగంలోనూ ఇక్కడ చాంపియన్లు కాలేకపోయారు. మధ్యలో సైనా నెహ్వాల్‌ (2015), లక్ష్య సేన్‌ (2022) ఫైనల్‌ దాకా వెళ్లినా రన్నరప్‌కే పరిమితమయ్యారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌ప మంగళవారం నుంచి 17వ తేదీ వరకు జరుగబోతోంది. ఈసారి మాత్రం డబుల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి రూపంలో భారత్‌ కల నెరవేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది రెండో రౌండ్‌కే పరిమితమైన ఈ ద్వయం ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉంది. గత ఆదివారమే ఫ్రెంచ్‌ ఓపెన్‌ను వేసుకున్న ఈ సూపర్‌ జోడీ.. ఆ జోరులోనే ఇక్కడా చెలరేగాలనే కసితో ఉంది. 2023లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఇండోనేసియాలో కెరీర్‌లో తొలి సూపర్‌ 1000 టైటిల్‌ను నెగ్గింది. తాజా టోర్నీ కూడా నాలుగు సూపర్‌ 1000 టైటిళ్లలో ఒకటి. అయితే మూడు సార్లు వరల్డ్‌ చాంపియన్స్‌గా నిలిచిన మహ్మద్‌ ఎహ్‌సాన్‌-హెండ్రా సెటియవాన్‌ (ఇండోనేసియా) జోడీతో భారత్‌ డబుల్స్‌ జంట తొలి రౌండ్‌లో తలపడనుంది. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సాత్విక్‌-చిరాగ్‌ వీరి చేతిలోనే ఓడారు. మిగతా భారత షట్లర్లలో లక్ష్య సేన్‌, ప్రణయ్‌, ప్రియాన్షు రజావత్‌, కిడాంబి శ్రీకాంత్‌ సింగిల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీ్‌సకు చేరిన లక్ష్య సేన్‌ ఈసారి ఇక్కడ టైటిల్‌ కొడితే సింగిల్స్‌లో ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.

సింధుకు కష్టమే..

గత నాలుగు నెలలుగా ఎడమ మోకాలి గాయంతో ఆటకు దూరమైన పీవీ సింధు ఇటీవలి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ వరకు చేరగలిగింది. ఇక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో వొన్నే లీ (జర్మనీ)పై తొలి రౌండ్‌ నెగ్గితే సింధు.. రెండో రౌండ్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌, టాప్‌ సీడ్‌ అన్‌ సీ యంగ్‌ (కొరియా)ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రత్యర్థి 2-0తో సింధుపై ఆధిక్యంలో ఉంది. ఆకర్షి కశ్యప్‌ భారత్‌ నుంచి బరిలో ఉన్న మరో సింగిల్స్‌ క్రీడాకారిణి. ఇక, డబుల్స్‌లో రెండేళ్లుగా సెమీస్‌దాకావచ్చిన ట్రీసా జాలీ-గాయత్రి జోడీ ఈసారైనా విజేత కావాలని పరితపిస్తోంది. వీరితో పాటు అశ్విని-తనీషా జోడీ ఏమేరకు ప్రభావం చూపుతారో చూడాలి.

Updated Date - Mar 12 , 2024 | 01:40 AM