Share News

ఈసారైనా నెరవేరేనా?

ABN , Publish Date - May 31 , 2024 | 05:56 AM

అన్నీ ఉన్నా.. ఐసీసీ ట్రోఫీకి ఆమడ దూరంలో నిలుస్తున్న సౌతాఫ్రికా.. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే గత రాజసం కోసం పోరాడుతున్న మాజీ విజేత శ్రీలంక...

ఈసారైనా నెరవేరేనా?

థ్రిల్లింగ్‌గా గ్రూప్‌-డి

  • ఫేవరెట్‌గా దక్షిణాఫ్రికా

  • సవాల్‌ విసిరే లంక, బంగ్లా

అన్నీ ఉన్నా.. ఐసీసీ ట్రోఫీకి ఆమడ దూరంలో నిలుస్తున్న సౌతాఫ్రికా.. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే గత రాజసం కోసం పోరాడుతున్న మాజీ విజేత శ్రీలంక.. అవకాశం చిక్కితే పంజా విసిరే బంగ్లాదేశ్‌లతో గ్రూప్‌-డి హోరాహోరీగా ఉంది. వీటితోపాటు నెదర్లాండ్స్‌, నేపాల్‌ జట్లు సంచలన విజయాలతో పెద్ద జట్ల తలరాతలను మార్చాలనే కసితో ఉన్నాయి.

సౌతాఫ్రికా: తమకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న వరల్డ్‌క్‌పను ఈసారైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న సఫారీలు.. బలమైన జట్టుతో ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగుతున్నారు. డికాక్‌, కెప్టెన్‌ మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, హెండ్రిక్స్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఆకట్టుకొన్న యువ ఆటగాడు స్టబ్స్‌ జట్టుకు ప్రత్యేక ఆకర్షణ. బౌలింగ్‌లో రబాడ, నోకియా, కొట్జీ, పేస్‌ భారాన్ని మోయనుండగా.. స్పిన్నర్లు కేశవ్‌, షంసీ కీలకం. జెన్సన్‌ ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించనున్నాడు.


శ్రీలంక: పెద్దగా స్లార్లు లేకపోయినా.. శ్రీలంక ఎప్పటికీ ప్రమాదకారే. మేజర్‌ టోర్నీలో జట్టును నడిపించడం కెప్టెన్‌గా వనిందు హసరంగకు ఇదే తొలిసారి. కుశాల్‌ మెండిస్‌, నిస్సాంక, చరిత్‌ అసలంక, సమరవిక్రమ, ధనుంజయ డిసిల్వలతో బ్యాటింగ్‌ లైనప్‌ లోతుగా ఉంది. అనుభవజ్ఞులైన ఏంజెలో మాథ్యూస్‌, డసున్‌ షనక పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు. హసరంగ, దునిత్‌ వెల్లలాగే, తీక్షణ స్పిన్‌ విభాగాన్ని నడిపించనున్నారు. పేసర్‌ మతీష పతిరన లంకకు తురుపుముక్క.

బంగ్లాదేశ్‌: జట్టులో కీలక ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోగా.. కొందరు గాయపడ్డారు. దీంతో సమతుల్యమైన జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు కష్టంగా మారింది. అనుభవజ్ఞుడైన ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ విఫలమవుతుండడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గాయపడిన వైస్‌ కెప్టెన్‌ టస్కిన్‌ ఫిట్‌నెస్‌ విషయంలో ఇంకా అనుమానాలున్నాయి. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌, మాజీ సారథి మహ్మదుల్లాపై అంచనాలున్నాయి. కొత్త కెప్టెన్‌ నజ్ముల్‌ హొస్సేన్‌ షంటోకు వీరు అండగా నిలవగలరు. స్లోపిచ్‌లపై పేసర్‌ ముస్తాఫిజుర్‌ ఆఫ్‌ కటర్‌లతో ప్రత్యర్థులను భయపెట్టగలడు.


నేపాల్‌: పూర్తిగా యువకులతో కూడిన నేపాల్‌ జట్టుకు 21 ఏళ్ల రోహిత్‌ పౌడెల్‌ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌-ఎతో జరిగిన సిరీ్‌సలో పౌడెల్‌ పరుగుల వరద పారించడం జట్టుకు లాభదాయకం. 9 బంతుల్లోనే అర్ధశతకంతో రికార్డు సృష్టించిన పవర్‌హిట్టర్‌ దీపేంద్రతోపాటు గుల్షన్‌, ప్రటీస్‌ జీసీ దూకుడుగా ఆడగలరు.

నెదర్లాండ్స్‌: ఐసీసీ టోర్నీలో నెదర్లాండ్స్‌ తరచూ సంచలనాలు సృష్టిస్తోంది. 2022 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే ప్రపంచక్‌పలో సౌతాఫ్రికాను ఓడించి ప్రకంపనలు సృష్టించిందీ జట్టు. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, బాస్‌ డి లీడ్స్‌, విక్రమ్‌ సింగ్‌, వెస్లీ బరేసి, లోగన్‌ వి బీక్‌లకు మెగా టోర్నీలో ఆడిన అనుభవం ఉంది.

Updated Date - May 31 , 2024 | 05:56 AM