Share News

రాజ్‌కోటలో పాగా ఎవరిదో?

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:01 AM

తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఇచ్చిన ఝలక్‌కు వైజాగ్‌ టెస్టులో టీమిండియా గట్టిగానే బదులిచ్చింది. తద్వారా ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది. యశస్వీ జైస్వాల్‌ సూపర్‌ బ్యాటింగ్‌, బుమ్రా మెరుపు బౌలింగ్‌.. వెరసి జట్టుకు...

రాజ్‌కోటలో పాగా ఎవరిదో?

ఉ. 9.30 నుంచి జియో సినిమాలో..

నేటి నుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు

భారత్‌కు గాయాల బెడద జూ కొత్త ఆటగాళ్లకు చాన్స్‌

రాజ్‌కోట్‌: తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఇచ్చిన ఝలక్‌కు వైజాగ్‌ టెస్టులో టీమిండియా గట్టిగానే బదులిచ్చింది. తద్వారా ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-1తో నిలిచింది. యశస్వీ జైస్వాల్‌ సూపర్‌ బ్యాటింగ్‌, బుమ్రా మెరుపు బౌలింగ్‌.. వెరసి జట్టుకు అద్భుత విజయం దక్కింది. తాజాగా బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జరుగనుంది. అయితే భారత జట్టుకు గాయాల బెడద, ఆటగాళ్ల ఫామ్‌లేమి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లేకపోవడంతో జట్టు మిడిలార్డర్‌ బలహీనంగా మారింది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే. అటు ఇంగ్లండ్‌ జట్టు ఈ టెస్టులో నెగ్గి తిరిగి ఆధిపత్యం చూపాలన్న కసితో ఉంది. అలాగే కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కిది కెరీర్‌లో వందో టెస్టు. అందుకే తమ సారథికి చక్కటి విజయాన్ని బహుమతిగా అందించాలని సహచరులు భావిస్తున్నారు.

సర్ఫరాజ్‌, జురెల్‌కు చాన్స్‌?: భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఓపెనర్‌ జైస్వాల్‌ మాత్రమే ఊపు మీదున్నాడు. ఈ సిరీ్‌సలో తను 321 పరుగులు సాధించగా, మిగతా వారంతా 170 లోపే ఉండడం గమనార్హం. వీరిలో శ్రేయాస్‌ అయ్యర్‌పై ఇప్పటికే వేటు పడగా, రాహుల్‌ గాయంతో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎదురుచూపులు ఫలించే చాన్స్‌ ఉంది. అతడితోపాటు యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ వైపు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతోంది. 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో జురెల్‌ 46.47 సగటుతో ఉండడం అతడికి కలిసివస్తోంది. ఎందుకంటే గత 12 ఇన్నింగ్స్‌లో కీపర్‌ కేఎస్‌ భరత్‌ బ్యాటింగ్‌లో విఫలమవుతూనే ఉన్నాడు. దీంతో తనపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రేయాస్‌ లేకపోవడంతో రజత్‌ పటీదార్‌కు వచ్చిన ముప్పేమీ లేదు. అటు ఓపెనర్‌ గిల్‌ చాలాకాలం తర్వాత ఈ ఫార్మాట్‌లో ఓ సెంచరీ సాధించి జట్టులో చోటును పదిలం చేసుకున్నాడు. ఇక బౌలింగ్‌లో ఆల్‌రౌండర్‌ జడేజా జట్టులోకి రావడం సానుకూలాంశమే. స్థానిక ఆటగాడిగా అతడికి పిచ్‌పై అవగాహన ఉంటుంది. అయితే తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వీరిని ఇంగ్లండ్‌ బ్యాటర్లు సులువుగా ఆడేస్తుండడం ఆందోళనకరంగా మారింది. పేసర్లలో బుమ్రాను ఆడిస్తే అతడికి జతగా విశ్రాంతి ముగించుకున్న సిరాజ్‌ కొనసాగుతాడు. అయితే జట్టు ఇద్దరు పేసర్లతో వెళ్లాలనుకుంటే స్పిన్నర్‌ కుల్దీ్‌పను బెంచీకే పరిమితం చేసి ఆల్‌రౌండర్లు అక్షర్‌, జడేజా, అశ్విన్‌లతో వెళ్లవచ్చు.

ఎదురుదాడే లక్ష్యంగా..: వారం రోజులపాటు అబుధాబిలో విశ్రాంతి తీసుకున్న ఇంగ్లండ్‌ జట్టు మూడో టెస్టులోనూ తమ శైలిని మార్చుకోవాలనుకోవడం లేదట. భారత్‌పై దూకుడు కనబరిచి వారు పొరపాట్లు చేసేవరకు వేచిచూడాలనుకుంటోంది. ఇప్పటివరకు ఇదే వర్కవుట్‌ అయ్యింది కాబట్టి కెప్టెన్‌ స్టోక్స్‌ తన వందో టెస్టులోనూ వెనక్కి తగ్గేదే లేదని భావిస్తున్నాడు. 2016లో ఇక్కడే జరిగిన టెస్టులో తనతో పాటు రూట్‌ కూడా శతకం సాధించాడు. ఇప్పటికే ప్రకటించిన తుది జట్టులో ఒక మార్పు చేసి సిరీ్‌సలో తొలిసారిగా రెండో సీమర్‌ను చేర్చారు. స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో మార్క్‌ ఉడ్‌ ఆడనున్నాడు.క్రాలే.. పోప్‌ మరోసారి కీలకం కానున్నారు. జో రూట్‌ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. స్పిన్నర్లు హార్ట్‌లీ, రెహాన్‌ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టగలుగుతున్నారు.

100

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కిది వందో టెస్టు. ఆ జట్టు తరఫున నూరు టెస్టులాడిన 16వ ప్లేయర్‌.

1

టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసేందుకు స్పిన్నర్‌ అశ్విన్‌కు

మరో వికెట్‌ చాలు.

జట్లు

భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌, ధ్రువ్‌ జురెల్‌, జడేజా, అశ్విన్‌, అక్షర్‌, బుమ్రా, సిరాజ్‌.

ఇంగ్లండ్‌: క్రాలే, డకెట్‌, ఒల్లీ పోప్‌, జో రూట్‌, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), బెన్‌ ఫోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, హార్ట్‌లీ, మార్క్‌ ఉడ్‌, అండర్సన్‌.

పిచ్‌

రాజ్‌కోట్‌ పిచ్‌ సహజంగానే బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన రెండు టెస్టుల్లో భారీగా పరుగులు నమోదయ్యాయి. ఫ్లాట్‌ వికెట్‌ కావడంతోనే ఇంగ్లండ్‌ కూడా తమ తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు చాలనుకుంది.

భారత్‌తో ఆడడం ఇష్టం

మైలురాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతకన్నా ముందు భారత్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడడాన్ని ఆస్వాదిస్తా. ఎందుకంటే ఈ జట్టుతో మాకెదురయ్యే పోటీతో పాటు అధిక స్థాయిలో ప్రేక్షకులు వస్తుంటారు. పిచ్‌ గురించి అతిగా ఆలోచించడం లేదు. బుమ్రా అద్భుత బౌలర్‌. అతడిని దీటుగా ఎదుర్కొని పరుగులు సాధించే వ్యూహంలో ఉన్నాం. విరాట్‌, రాహుల్‌ లేకపోవడం మాకు అనుకూలంగానో, భారత్‌ను దెబ్బతీసేదిగానో భావించడం లేదు.

బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌ కెప్టెన్‌)

వారిని ఓడించడం అసాధ్యం కాదు

భారత గడ్డపై గెలవడం పర్యాటక జట్లకు సులువేమీ కాదు. కానీ ఇంగ్లండ్‌ అటాకింగ్‌ గేమ్‌తో ఆడుతోంది. అలాగని ఆ జట్టును ఓడించడం అసాధ్యమని అనుకోవడం లేదు. మేం కూడా వారి శైలితోనే జవాబివ్వాల్సి ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చిన్న తప్పులను చేయకపోయుంటే ఫలితం మరోలా ఉండేది. నేనిక వంద శాతం ఫిట్‌గా ఉండేలా ప్రయత్నిస్తా. అవసరం లేని చోట డైవింగ్‌కు దూరంగా ఉంటా. ఇక అశ్విన్‌ ఇక్కడే 500 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.

స్పిన్నర్‌ జడేజా

Updated Date - Feb 15 , 2024 | 04:01 AM