Share News

విశాఖ దద్దరిల్లింది

ABN , Publish Date - Apr 04 , 2024 | 06:12 AM

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) ఉచకోతకు అంక్రిష్‌ రఘువంశీ (27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) సుడిగాలి ఇన్నింగ్స్‌ తోడవడంతో...

విశాఖ దద్దరిల్లింది

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X పంజాబ్‌, రా.7.30 నుంచి

ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు కోల్‌కతా 272/7

  • నరైన్‌, రఘువంశీ ధనాధన్‌ ఇన్నింగ్స్‌

  • అదరగొట్టిన రస్సెల్‌, రింకూ

  • 106 పరుగులతో ఢిల్లీ ఢమాల్‌

విశాఖపట్నం: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) ఉచకోతకు అంక్రిష్‌ రఘువంశీ (27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) సుడిగాలి ఇన్నింగ్స్‌ తోడవడంతో.. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. తొలుత కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగుల భారీ స్కోరు చేసింది. రస్సెల్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) ధాటిగా ఆడాడు. నోకియా 3, ఇషాంత్‌ 2 వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), స్టబ్స్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) మినహా అంతా విఫలమయ్యారు. వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి చెరో 3 వికెట్లు.. స్టార్క్‌ 2 వికెట్లు కూల్చాడు.

పెవిలియన్‌కు క్యూ..: కొండంత లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు ముందుగానే చేతులెత్తేశారు. 33 పరుగులకే టాపార్డర్‌ బ్యాటర్లు వార్నర్‌ (18), పృథ్వీ షా (10), మిచెల్‌ మార్ష్‌ (0), అభిషేక్‌ పోరెల్‌ (0)ను కోల్పోయిన క్యాపిటల్స్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్ష్‌, వార్నర్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయగా.. షా, పోరెల్‌ను ఆరోరా పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో స్టబ్స్‌, పంత్‌ ఐదో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. రిషభ్‌ సిక్స్‌తో ఖాతా తెరవగా.. స్టబ్స్‌ రెండు బౌండ్రీలు బాదడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 51/4 స్కోరు చేసింది. మధ్య ఓవర్లలో కూడా వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డులో ఊపుతెచ్చారు. అయితే, వెంకటేష్‌ అయ్యర్‌ వేసిన 12వ ఓవర్‌లో 4,6,6,4,4,4తో 28 పరుగులు పిండుకొన్న పంత్‌ వరుసగా రెండో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కానీ, రిషభ్‌, అక్షర్‌ (0)తోపాటు స్టబ్స్‌ను చక్రవర్తి అవుట్‌ చేయడంతో ఢిల్లీ పోరాటం ముగిసింది.

బాదుడే.. బాదుడు..: ఓపెనర్‌ నరైన్‌, టీనేజర్‌ రఘువంశీ అదిరే ఆటకు.. రస్సెల్‌ పవర్‌ హిట్టింగ్‌ తోడుకావడంతో కోల్‌కతా పరుగుల వరద పారించింది. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన నరైన్‌, రఘువంశీ కేవలం 48 బంతుల్లో 102 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న కోల్‌కతాకు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (18), నరైన్‌ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. 4వ ఓవర్‌లో ఇషాంత్‌ బౌలింగ్‌లో నరైన్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు పిండుకోవడంతో.. స్కోరు బోర్డు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో సాల్ట్‌ను నోకియా క్యాచవుట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ.. నరైన్‌ పోటీపడి మరీ షాట్లు ఆడడంతో రన్‌రేట్‌ మరింతగా జోరందుకొంది. రసిక్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిన సునీల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. ఆరు ఓవర్లకు కోల్‌కతా 88/1తో నిలిచింది. 53 పరుగుల స్కోరు వద్ద నరైన్‌ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను నోకియా అందుకోలేక పోవడంతో నరైన్‌ మరింతగా విజృంభించాడు. మరోవైపు రఘువంశీ కూడా సిక్స్‌లతో చెలరేగడంతో.. 11వ ఓవర్‌లోనే జట్టు స్కోరు 150 మార్క్‌కు చేరుకొంది. అయితే, సునీల్‌ను క్యాచవుట్‌ చేసిన మార్ష్‌.. ఎట్టకేలకు ఢిల్లీకి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ వెంటనే ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న రఘువంశీని నోకియా బోల్తా కొట్టించాడు. కానీ, రస్సెల్‌ ఎడాపెడా షాట్లతో 16వ ఓవర్‌లోనే నైట్‌రైడర్స్‌ స్కోరు 200 పరుగులు దాటింది. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (18) మరోసారి షార్ట్‌ బాల్‌కు అవుట్‌ కాగా.. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన రింకూ సింగ్‌ (8 బంతుల్లో ఓ ఫోర్‌, 3 సిక్సర్లతో 26)ను నోకియా వెనక్కిపంపాడు. ఆఖరి ఓవర్‌లో రస్సెల్‌, రమణ్‌దీప్‌ (2)ను అవుట్‌ చేసిన ఇషాంత్‌.. ఇటీవల ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ నమోదుచేసిన అత్యధిక ఐపీఎల్‌ స్కోరు రికార్డును కోల్‌కతా దాటకుండా అడ్డుకొన్నాడు.

స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి) స్టబ్స్‌ (బి) నోకియా 18, నరైన్‌ (సి) పంత్‌ (బి) మార్ష్‌ 85, రఘువంశీ (సి) ఇషాంత్‌ (బి) నోకియా 54, రస్సెల్‌ (బి) ఇషాంత్‌ 41, శ్రేయాస్‌ (సి) స్టబ్స్‌ (బి) ఖలీల్‌ 18, రింకూ సింగ్‌ (సి) వార్నర్‌ (బి) నోకియా 26, వెంకటేశ్‌ (నాటౌట్‌) 5, రమణ్‌దీప్‌ (సి) పృథ్వీ షా (బి) ఇషాంత్‌ 2, స్టార్క్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 20 ఓవర్లలో 272/7; వికెట్ల పతనం: 1-60, 2-164, 3-176, 4-232, 5-264, 6-264, 7-266; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-43-1, ఇషాంత్‌ 3-0-43-2, నోకియా 4-0-59-3, రసిఖ్‌ 3-0-47-0, సుమిత్‌ 2-0-19-0, అక్షర్‌ 1-0-18-0, మార్ష్‌ 3-0-37-1.

ఢిల్లీ: వార్నర్‌ (బి) స్టార్క్‌ 18, పృథ్వీ షా (సి) వరుణ్‌ (బి) వైభవ్‌ 10, మార్ష్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 0, అభిషేక్‌ (సి) నరైన్‌ (బి) వైభవ్‌ 0, పంత్‌ (సి) శ్రేయాస్‌ (బి) వరుణ్‌ 55, స్టబ్స్‌ (సి) స్టార్క్‌ (బి) వరుణ్‌ 54, అక్షర్‌ (సి/సబ్‌) పాండే (బి) వరుణ్‌ 0, సుమిత్‌ (సి/సబ్‌) పాండే (బి) నరైన్‌ 7, రసిఖ్‌ (సి) సాల్ట్‌ (బి) వైభవ్‌ 1, నోకియా (సి) శ్రేయాస్‌ (బి) రస్సెల్‌ 4, ఇషాంత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 17.2 ఓవర్లలో 166 ఆటౌట్‌; వికెట్ల పతనం: 1-21, 2-26, 3-27, 4-33, 5-126, 6-126, 7-159, 8-159, 9-161, 10-166; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-25-2, వైభవ్‌ 4-0-27-3, రస్సెల్‌ 1.2-0-14-1, నరైన్‌ 4-0-29-1, వరుణ్‌ 4-0-33-3, వెంకటేశ్‌ 1-0-28-0.

టీనేజర్‌.. బెరుకులేని బ్యాటర్‌!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

వైజాగ్‌లో.. సీనియర్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌తో కలిసి ఓ కుర్రోడు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నది తొలి మ్యాచైనా ఏ మాత్రం జంకకుండా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఫ్యాన్స్‌ను అలరించాడు. అంతేకాదు.. 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు. అతడే ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల అంక్రిష్‌ రఘువంశీ. క్రికెట్‌పై అనురక్తితో రఘు..11 ఏళ్ల వయస్సులో ముంబై తరలివెళ్లి అభిషేక్‌ నాయర్‌ ఆధ్వర్యంలో ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. పొడగరి అయిన రఘు 2022లో కరీబియన్‌ దీవుల్లో జరిగిన అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 2023-24 సీజన్‌లో ముంబై తరపున లిస్ట్‌ ‘ఏ’, టీ20 అరంగేట్రం చేశాడు. వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రఘువంశీని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసినా బ్యాటింగ్‌ అవకాశం మాత్రం రాలేదు. ఇక ఢిల్లీతో పోరులో మూడో నెంబర్‌లో దిగిన రఘు.. నోకియా, అక్షర్‌ పటేల్‌, మిచెల్‌ మార్ష్‌ వంటి స్టార్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

టీ20ల్లో జట్టు అత్యధిక స్కోర్లు

ఎవరు ఎంత ఎవరిపై ఎప్పుడు

నేపాల్‌ 314/3 మంగోలియా 2023

అఫ్ఘానిస్థాన్‌ 278/3 ఐర్లాండ్‌ 2019

చెక్‌ రిపబ్లిక్‌ 278/4 టర్కీ 2019

హైదరాబాద్‌ 277/3 ముంబై 2024

కోల్‌కతా 272/7 ఢిల్లీ 2024

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 3 3 0 0 6 2.518

రాజస్థాన్‌ 3 3 0 0 6 1.249

చెన్నై 3 2 1 0 4 0.976

లఖ్‌నవూ 3 2 1 0 4 0.483

గుజరాత్‌ 3 2 1 0 4 -0.738

హైదరాబాద్‌ 3 1 2 0 2 0.204

పంజాబ్‌ 3 1 2 0 2 -0.337

బెంగళూరు 4 1 3 0 2 -0.876

ఢిల్లీ 4 1 3 0 2 -1.347

ముంబై 3 0 3 0 0 -1.423

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

పంత్‌ కారణంగా..

రివ్యూలు తీసుకోవడంలో రిషభ్‌ పంత్‌ వైఫల్యం కారణంగా ఢిల్లీ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్‌ బౌలింగ్‌లో నరైన్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకొగా.. పంత్‌ రివ్యూ తీసుకోవడంలో ఆలస్యం చేశాడు. ఇక, రసిక్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ క్యాచవుట్‌ విషయంలో కూడా రివ్యూకు నిరాకరించాడు.

1

ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రఘువంశీ (18 ఏళ్ల 303 రోజులు). 2008లో శ్రీవత్స్‌ గోస్వామి (19 ఏళ్లు) అరంగేట్రం మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు.

Updated Date - Apr 04 , 2024 | 06:12 AM