రాజకీయాల్లోకి వినేశ్?
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:57 AM
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ పతకానికి దూరమైన రెజ్లర్ వినేశ్ ఫొగట్ దృష్టి ఇప్పుడు రాజకీయాలపై పడిందనే కథనాలు వినిపిస్తున్నాయి. అనర్హతకు గురైన వెంటనే వినేశ్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం...
సోదరి బబితపై పోటీ!
చండీగఢ్: అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ పతకానికి దూరమైన రెజ్లర్ వినేశ్ ఫొగట్ దృష్టి ఇప్పుడు రాజకీయాలపై పడిందనే కథనాలు వినిపిస్తున్నాయి. అనర్హతకు గురైన వెంటనే వినేశ్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. త్వరలో జరుగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా వరుసకు తన సోదరైన మాజీ రెజ్లర్ బబితా ఫొగట్‌పై పోటీకి దిగనుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ‘రాజకీయాల్లోకి వినేశ్ ఎందుకు రాకూడదు? కొన్ని పార్టీలు ఇప్పటికే ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ పార్టీలో చేరనుందనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే, హరియాణా ఎన్నికల్లో వినేశ్ వర్సెస్ బబితా పోటీ కూడా ఉండవచ్చు’ అని వినేశ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు వినేశ్ భారత్‌కు చేరుకున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా అంతా తానై స్వాగత ఏర్పాట్లు చేశాడు. ఇక బబితా ఫొగట్ బీజేపీ తరఫున 2019లో దాద్రి స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయింది.