Share News

U19 World Cup: ఒత్తిడికి చిత్తయ్యారు.. ఫైనల్లో యువ భారత్ ఓటమి

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:45 AM

భారత సీనియర్‌ జట్టునే కాదు.. యువ ఆటగాళ్ల ఆశల్ని కూడా ఆస్ట్రేలియా చెల్లాచెదురు చేసింది. ఆదివారం జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించిన కంగారూలు విశ్వవిజేతలుగా...

U19 World Cup: ఒత్తిడికి చిత్తయ్యారు.. ఫైనల్లో యువ భారత్ ఓటమి

ఫైనల్లో భారత్‌ ఓటమి

ఆస్ట్రేలియాదే అండర్‌-19 వరల్డ్‌కప్‌

బెనోని: భారత సీనియర్‌ జట్టునే కాదు.. యువ ఆటగాళ్ల ఆశల్ని కూడా ఆస్ట్రేలియా చెల్లాచెదురు చేసింది. ఆదివారం జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించిన కంగారూలు విశ్వవిజేతలుగా నిలిచారు. టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్‌కు దూసుకువచ్చిన భారత్‌ కీలక పోరులో అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. గతేడాది నవంబరులో రోహిత్‌ సేన సైతం వరుస విజ యాలతో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరి ఆసీస్‌ చేతిలోనే ఓడ డం గమనార్హం. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ హర్జాస్‌ సింగ్‌ (55), హ్యూజ్‌ వీబ్జెన్‌ (48), ఒలివర్‌ పీక్‌ (46 నాటౌట్‌), హ్యారీ డిక్సన్‌ (42) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. పేసర్‌ రాజ్‌ లింబానికి మూడు, నమన్‌ తివారికి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఆదర్శ్‌ (47), అభిషేక్‌ (42) ఫర్వాలేదనిపించారు. బీర్డ్‌మన్‌, మెక్‌మిలన్‌కు మూడేసి, వీడ్లెర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు బీర్డ్‌మన్‌కు దక్కగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా దక్షిణాఫ్రికా పేసర్‌ మఫాకా నిలిచాడు.

బ్యాటింగ్‌ వైఫల్యం

భారీ ఛేదనలో భారత్‌ దారుణంగా తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. టెయిలెండర్‌ అభిషేక్‌ పోరాటం కాస్త ఆశలు రేపినా మరో ఎండ్‌లో వికెట్లు లేకపోవడం దెబ్బతీసింది. అయితే తొమ్మిదో వికెట్‌కు తివారి (14 నాటౌట్‌)తో కలిసి అందించిన 46 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధికం. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కీలక బ్యాటర్లు ఉదయ్‌, సచిన్‌ కనీసం పది పరుగులైనా సాధించ లేకపోయారు. ఆరంభంలో ఓపెనర్‌ ఆదర్శ్‌ ఓపికను ప్రదర్శిం చాడు. మూడో ఓవర్‌లోనే సాగిన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. పేసర్‌ బీర్డ్‌మన్‌, స్పిన్నర్‌ మెక్‌మిలన్‌ సంయుక్తంగా భారత్‌ పతనాన్ని శాసించారు. రెండో వికెట్‌కు ఆదర్శ్‌, ముషీర్‌ 37 పరుగులు జత చేశారు. ఓ దశలో భారత్‌ 122/8 స్కోరుతో ఇబ్బందికరపరిస్థితిలో ఉండగా అభిషేక్‌, తివారి దాదాపు తొమ్మిది ఓవర్లపాటు ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. మరో 57 బంతుల్లో 86 రన్స్‌ కావాల్సిన వేళ అభిషేక్‌ను వీడ్లర్‌ అవుట్‌ చేయడంతో ఇక ఎలాంటి ఆశలు లేకపోయింది.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: డిక్సన్‌ (సి) అభిషేక్‌ (బి) తివారి 42; కొన్‌స్టాస్‌ (బి) లింబాని 0; వీబ్జెన్‌ (సి) ముషీర్‌ ఖాన్‌ (బి) తివారి 48; హర్జాస్‌ (ఎల్బీ) సౌమీ 55; రియాన్‌ (ఎల్బీ) లింబాని 20; పీక్‌ (నాటౌట్‌) 46; మెక్‌మిలన్‌ (సి అండ్‌ బి) ముషీర్‌ ఖాన్‌ 2; అండర్సన్‌ (ఎల్బీ) లింబాని 13; స్ట్రాకర్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 50 ఓవర్లలో 253/7. వికెట్ల పతనం: 1-16, 2-94, 3-99, 4-165, 5-181, 6-187, 7-221. బౌలింగ్‌: లింబాని 10-0-38-3; తివారి 9-0-63-2; సౌమీ 10-0-41-1; ముషీర్‌ 9-0-46-1; అభిషేక్‌ 10-0-37-0; మోలియా 2-0-17-0.

భారత్‌: ఆదర్శ్‌ (సి) హిక్స్‌ (బి) బీర్డ్‌మన్‌ 47; అర్షిన్‌ (సి) హిక్స్‌ (బి) వీడ్లెర్‌ 3; ముషీర్‌ (బి) బీర్డ్‌మన్‌ 22; ఉదయ్‌ (సి) వీబ్జెన్‌ (బి) బీర్డ్‌మన్‌ 8; సచిన్‌ దాస్‌ (సి) హిక్స్‌ (బి) మెక్‌మిలన్‌ 9; మోలియా (సి) వీడ్లెర్‌ (బి) అండర్సన్‌ 9; అవనీష్‌ (సి అండ్‌ బి) మెక్‌మిలన్‌ 0; అభిషేక్‌ (సి) వీబ్జెన్‌ (బి) వీడ్లెర్‌ 42; లింబాని (బి) మెక్‌మిలన్‌ 0; తివారి (నాటౌట్‌) 14; సౌమీ (సి) హిక్స్‌ (బి) స్ట్రాకర్‌ 2; ఎక్స్‌ట్రాలు:18; మొత్తం: 43.5 ఓవర్లలో 174 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-3, 2-40, 3-55, 4-68, 5-90, 6-91, 7-115, 8-122, 9-168, 10-174. బౌలింగ్‌: వీడ్లెర్‌ 10-2-35-2; అండర్సన్‌ 9-0-42-1; స్ట్రాకర్‌ 7.5-1-32-1; బీర్డ్‌మన్‌ 7-2-15-3; మెక్‌మిలన్‌ 10-0-43-3.

1

అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు (253) సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా

4

ఆస్ట్రేలియాకిది నాలుగో వరల్డ్‌కప్‌ టైటిల్‌

Updated Date - Feb 12 , 2024 | 06:51 AM