Share News

కన్నీటి కష్టాలు దాటుకొని..

ABN , Publish Date - May 21 , 2024 | 01:18 AM

నిరుపేద కుటుంబం.. అమ్మానాన్న కూలికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి.. వీటికితోడు తన వైకల్యాన్ని చూసి వెక్కిరింపులు, ఛీత్కారాలు.. ఇలా ఎన్నో అవమానాలు ఎదురైనా...

కన్నీటి కష్టాలు దాటుకొని..

(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి - హైదరాబాద్‌)

నిరుపేద కుటుంబం.. అమ్మానాన్న కూలికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి.. వీటికితోడు తన వైకల్యాన్ని చూసి వెక్కిరింపులు, ఛీత్కారాలు.. ఇలా ఎన్నో అవమానాలు ఎదురైనా, వాటన్నింటిని అధిగమిస్తూ ముందుకు సాగింది.. పరుగే శ్వాసగా జీవించింది.. తనకు అవహేళనలు ఎదురైన చోటే ప్రశంసలు అందుకుంటూ ఇవాళ ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో మెరిసింది. తన విజయంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచింది 21 ఏళ్ల దీప్తి జీవాంజి.


వరంగల్‌ జిల్లాలోని మారుమూల గ్రామం కల్లెడ, దీప్తి స్వస్థలం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజు కూలీలు. తినడానికి మంచి తిండి లేక, చదువుకోవడానికి నోచుకోని దీప్తి జీవితాన్ని ఒక్క ‘పరుగు’ మలుపు తిప్పింది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సాధించిన స్వర్ణం, దీప్తి అథ్లెటిక్స్‌ ప్రస్థానానికి పునాది వేసింది. ఈ పోటీల్లో దీప్తి ప్రదర్శన గురించి తెలుసుకున్న ‘సాయ్‌’ సీనియర్‌ అథ్లెటిక్‌ కోచ్‌ నాగపురి రమేష్‌, మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించాడు. కానీ, ఆ సమయంలో దీప్తి వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చేందుకు బస్సు చార్జీలకు కూడా డబ్బులు లేని దుస్థితి. మరోవైపు.. ‘మానసిక దివ్యాంగురాలు.. ఎదుటి వాళ్లు చెప్పేదే సరిగ్గా అర్థం చేసుకోలేదు. అలాంటిది క్రీడల్లో దేశం తరఫున పతకాలు సాధిస్తుందా? క్రీడలు, ట్రైనింగ్‌ అంటూ హైదరాబాద్‌ చుట్టూ తిరిగితే ఇక ఈ అమ్మాయికి పెళ్లి కూడా కాదు’ అని ఎంతో మంది అవహేళన చేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా దీప్తిని తల్లిదండ్రులు హైదరాబాద్‌ పంపించారు. అనుకున్నట్టే దీప్తి..


అనతికాలంలోనే రమేశ్‌ శిక్షణలో జాతీయ, అంతర్జాతీయస్థాయికి రాటుదేలింది. గోపీచంద్‌-మైత్రాహ్‌ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న దీప్తి, తొలుత సాధారణ అథ్లెట్లతో కలిసి పోటీ పడేది. ఒకసారి జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ దీప్తిని గమనించి, ఆమె సమస్యను తెలుసుకొని, వైద్య పరీక్షలు చేయించాడు. ఆమెకు ఐక్యూ చాలా తక్కువగా ఉందని, ఎదుటి వారు చెప్పేవి అర్ధం చేసుకోవడం, సొంతంగా ఆలోచించడంలో ఇబ్బందులున్నాయని తెలిసి, పారా క్రీడల్లోని టీ20 విభాగానికి మార్చాడు. అప్పట్నుంచి దీప్తి వెనుదిరిగి చూడలేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తన సత్తా చాటుతూనే ఉంది. గతేడాది హాంగ్జౌలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల రేసులో దీప్తి స్వర్ణ పతకంతో సత్తాచాటింది. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో పాటు పారిస్‌ పారాలింపిక్స్‌లో దేశం తరఫున పోటీపడే స్థాయికి చేరుకుంది.

Updated Date - May 21 , 2024 | 01:18 AM