Share News

ఇలా కదా ఆడాలి!

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:43 AM

స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ, వెటరన్‌ పేసర్‌ షమి సిరీస్‌ మొత్తానికి అందుబాటులో లేరు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ ఆడింది ఒక్క మ్యాచే.. ఉప్పల్‌లో తొలి టెస్టు ఓటమి తర్వాత ఆల్‌రౌండర్‌ జడేజా కూడా తర్వాతి మ్యాచ్‌కు దూరమయ్యాడు...

ఇలా కదా ఆడాలి!

స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ, వెటరన్‌ పేసర్‌ షమి సిరీస్‌ మొత్తానికి అందుబాటులో లేరు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ ఆడింది ఒక్క మ్యాచే.. ఉప్పల్‌లో తొలి టెస్టు ఓటమి తర్వాత ఆల్‌రౌండర్‌ జడేజా కూడా తర్వాతి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ దశలో 0-1తో రెండో టెస్టు బరిలోకి దిగిన భారత జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి.. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ గేమ్‌కు తూట్లు పొడుస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ అక్షరాలా జరిగింది అదే. ప్రత్యర్థినే ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఏ ఒక్క టెస్టును ఐదు రోజుల వరకు కూడా తీసుకెళ్లకుండా రోహిత్‌ సేన స్వదేశంలో వరుసగా 17వ సిరీ్‌సను సాధించింది. ఆఖరి టెస్టులో రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్‌ గెలుపు అందుకుంది. ఇందుకు ప్రధాన కారణం జట్టులోని యువ ఆటగాళ్లు. వీరికి సీనియర్లు సహకారం అందించడంతో ఘన విజయం సాధ్యమైంది.

అరంగేట్రం అదిరేలా..

కొందరు సీనియర్లు జట్టుకు దూరమవడంతో ఏకంగా ఐదుగుర ప్లేయర్లు ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అరంగేట్రం చేశారు. ఇందులో రజత్‌ పటీదార్‌ మినహా సర్ఫరాజ్‌, కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌, పేసర్‌ ఆకాశ్‌ దీప్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌ తమ ప్రదర్శనతో కెప్టెన్‌, కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టారు. అంతేకాదు.. ఎంత పెద్ద బాధ్యత తీసుకోవడానికైనా సిద్ధమని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పారు. ఒకప్పుడు జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిన సుదీర్ఘ ఫార్మాట్‌లో వచ్చిన చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ వహ్వా.. అనేలా ఆడేస్తున్నారు. రాజ్‌కోట్‌లో తొలిసారిగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్‌, జురెల్‌ వెంటనే తమ ప్రభావాన్ని చూపారు. జురెల్‌ తొలి శతకాన్ని తృటిలో కోల్పోయాడు. ఇక, సర్ఫరాజ్‌ రాజ్‌కోట్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక ధర్మశాలలో పేస్‌ను సైతం దీటుగా ఎదుర్కొంటానని మార్క్‌ ఉడ్‌ ఓవర్‌లో నిరూపించాడు. శరీరాన్ని విల్లులా వంచేస్తూ సర్ఫరాజ్‌ ఆడిన ర్యాంప్‌ షాట్‌ ఆ మ్యాచ్‌కే హైలైట్‌. పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప రాంచీ టెస్టులో బుల్లెట్‌లాంటి బంతులతో ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా కనిపించాడు. అరంగేట్రంలోనే ప్రత్యర్థి టాపార్డర్‌ను కూల్చి మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆఖరి టెస్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న దేవ్‌దత్‌ ఎలాంటి బెరుకు లేకుండా 65 పరుగులతో అరంగేట్ర ఫిఫ్టీని అందుకున్నాడు. అందుకే యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తుందని కోచ్‌ ద్రవిడ్‌ సైతం ప్రశంసించాడు.

స్థాయికి తగ్గ సీనియర్లు

సిరీస్‌ విజయంలో సీనియర్ల పాత్రను తక్కువ చేయలేం. వైజాగ్‌ టెస్టులో వెటరన్‌ పేసర్‌ బుమ్రా రివర్వ్‌ స్వింగ్‌ విధ్వంసం చూశాం. 25 ఓవర్ల పాత బంతితో అతను ఈ స్వింగ్‌ను రాబడుతూ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఒల్లీ పోప్‌ను రివర్స్‌ స్వింగ్‌ యార్కర్‌తోనే బౌల్డ్‌ చేయడం సిరీ్‌సకే హైలైట్‌. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ ఇంగ్లండ్‌ను ప్రతీ మ్యాచ్‌లో దెబ్బతీశారు. అశ్విన్‌ 26, జడ్డూ 19 వికెట్లు తీయగా.. రెండో టెస్టు నుంచి కుల్దీప్‌ కీలకంగా మారి బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇలా యువ ఆటగాళ్లు, సీనియర్ల మేళవింపుతో ఇంగ్లండ్‌పై భారత జట్టు అద్భుత సిరీస్‌ విజయాన్ని అందుకోగలిగింది.

‘జైస్‌’బాల్‌తో సునామీ

ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ చిన్నబోయేలా యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఈ సిరీ్‌సలో రాణించిన తీరు అతడి కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఏకంగా ఐదు టెస్టుల్లో 712 పరుగులు సాధించి ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. వైజాగ్‌, రాజ్‌కోట్‌ టెస్టుల్లో డబుల్‌ సెంచరీలతో ఔరా.. అనిపించాడు. ముఖ్యంగా వైజాగ్‌లోని రెండో టెస్టులో అతడి 209 పరుగులే సిరీ్‌సలో తొలి విజయానికి దోహదపడ్డాయి. ఈ సిరీ్‌సలో అతను బాదిన 26 సిక్సర్లు జైస్వాల్‌ పవర్‌గేమ్‌కు నిదర్శనంగా నిలుస్తాయి. అటు యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండు సెంచరీలతో రాణించి 452 రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు.

Updated Date - Mar 11 , 2024 | 02:43 AM