Share News

ఇలాగైతే కష్టమే!

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:28 AM

ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప పట్టికలో భారత జట్టు రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమే ఇందుకు కారణం. ఆసీస్‌ టాప్‌లో ఉండగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ తర్వాత స్థానంలో...

ఇలాగైతే కష్టమే!

అండర్‌-19 ప్రపంచ కప్‌ సూపర్‌ సిక్స్‌ పోరు నేడు

భారత్‌ X న్యూజిలాండ్‌ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ...

ఐదో స్థానానికి టీమిండియా

దుబాయ్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప పట్టికలో భారత జట్టు రెండు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమే ఇందుకు కారణం. ఆసీస్‌ టాప్‌లో ఉండగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ తర్వాత స్థానంలో టీమిండియా కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్‌లో భారత్‌ ఆడిన ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఓ డ్రాతో ఉంది. అటు ఆసీ్‌సపై అద్భుత విజయం సాధించిన విండీస్‌ జట్టు ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి ఏడో స్థానానికి వెళ్లింది.

హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ అందరి అంచనాలను తలకిందులు చేసింది. స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉండే ఉపఖండ పిచ్‌లపై బజ్‌బాల్‌ గేమ్‌ పనికిరాదన్న అభిప్రాయాలను తోసిరాజన్న రీతిలో వారి ఆటతీరు సాగింది. చివరకు తమ వ్యూహాన్నే నమ్ముకుని 28 పరుగుల తేడాతో గెలిచి చూపించారు. వాస్తవానికి 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి కూడా భారత ఆటగాళ్లు మ్యాచ్‌ని సమర్పించుకోవడం అభిమానులకు మింగుడుపడలేదు. భారత ప్రధాన ఆయుధమైన స్పిన్‌ను ఒల్లీ పోప్‌ స్వీప్‌ షాట్లతో చెడుగుడు ఆడాడు. స్లో టర్నింగ్‌ పిచ్‌పైనా అశ్విన్‌, జడేజా, అక్షర్‌ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్‌ 400కు పైగా పరుగులు చేయడంతో భారత్‌ తీవ్ర ఒత్తిడికి లోనుకావాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో గతంలో ఎన్నడూ ఓ జట్టు ఇక్కడ ఇన్ని రన్స్‌ కొట్టలేదు. ఇక టెస్టులో 200+ ఛేదన అంటే ఏమాత్రం సులువు కాదు. కానీ ఐదు సెషన్లున్న వేళ భారత బ్యాటర్లు కాస్త సహనంతో ఆడాల్సిందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమైంది. ఓ అరంగేట్ర స్పిన్నర్‌కు ఏడు వికెట్లు సమర్పించుకుని తెల్లమొహం వేయాల్సి వచ్చింది. యువ ఆటగాళ్లు స్పిన్‌పై ఎదురుదాడికి దిగేందుకు భారీ షాట్లను నమ్ముకుని మూల్యం చెల్లించుకున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. రిస్క్‌ తీసుకోకుండా సింగిల్స్‌, డబుల్స్‌తోనూ వారిపై ఒత్తిడి పెంచేందుకు ఆస్కారం ఉంటుంది. గతంలో ద్రవిడ్‌, లక్ష్మణ్‌ ఇలాగే ఆడుతూ ఆదుకునేవారు. ప్రస్తుత జట్టు లో కోహ్లీ మాత్రమే అలాంటి ఆటతీరును ప్రదర్శిస్తాడని చెప్పవచ్చు. లెఫ్టామ్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తన బలహీనతకు కూడా ఈ తరహా ఆటతీరుతోనే అధిగమిస్తాడు. స్పిన్‌ను ఆడేటప్పుడు మణికట్టు, పాదాల కదలిక ఎక్కువ ప్రభావం చూపుతుందనే విషయాన్ని యువ ఆటగాళ్లు మరిచిపోరాదని మాజీలు సూచిస్తున్నారు.

గతంలా కాదు..

2021లోనూ ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు తొలి టెస్టును గెలిచి.. ఆ తర్వాత మూడింటిని ఓడింది. అయితే ఆ సమయంలో కోహ్లీ, రహానె, పంత్‌ మిడిలార్డర్‌లో స్పిన్‌ను అద్భుతంగా ఎదుర్కోగలిగారు. కానీ ఈసారి రెండో టెస్టులో ఆ త్రయం లేదు. ఇటు చూస్తే శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌.. స్పిన్‌ బౌలింగ్‌లో ఇబ్బందిపడుతుంటారు. వాస్తవానికి ఈ ఇద్దరూ గత పది ఇన్నింగ్స్‌లో ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఇక, విశాఖ టెస్టుకు జడేజా, రాహుల్‌ దూరమవడం మరో దెబ్బ. అటు విజయం రుచి చూసిన ఇంగ్లండ్‌ను నిలువరించడం మనోళ్లకు పెద్ద సవాలే. ఈ మ్యాచ్‌ కోసం ఎలాంటి పిచ్‌ను రూపొందించినా సమష్టి ఆటతీరును ప్రదర్శిస్తేనే ఫలితం కనిపిస్తుంది. అప్పటి రూట్‌ సేనలా కాకుండా ప్రస్తుతం మెకల్లమ్‌ శిక్షణలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు పూర్తి విభిన్నంగా ముందుకెళ్తోంది. అందుకే 2-0తో వారికి ఆధిక్యం అప్పగిస్తే తిరిగి కోలుకోవడం కష్టమే. ఏదిఏమైనా తమ మైండ్‌సెట్‌తో పాటు బ్యాటింగ్‌లో లోపాలను కూడా రోహిత్‌ సేన వెంటనే సరిచేసుకుని దాడి ఆరంభించాల్సి ఉంది.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - Jan 30 , 2024 | 03:28 AM