కివీస్‌తో టెస్టుకు ముగ్గురు పేసర్లతోనే!
ABN , Publish Date - Oct 15 , 2024 | 05:51 AM
న్యూజిలాండ్‌తో ఈనెల 16 నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో పచ్చికతో కూడిన పిచ్‌ను సిద్ధం చేశారు.
న్యూజిలాండ్‌తో ఈనెల 16 నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో పచ్చికతో కూడిన పిచ్‌ను సిద్ధం చేశారు. దీంతో చక్కటి బౌన్స్ లభించే చాన్సుంది. ఇటీవల బంగ్లాతో సిరీ్‌సలోనూ జట్టు ఇదే వ్యూహంతో ముందుకెళ్లింది. తొలి టెస్టు జరిగిన చెన్నై వికెట్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంటుంది. కానీ జట్టు మాత్రం పేసర్లకు తగినట్టుగా తయారు చేయించింది. ఇప్పుడు కూడా రాబోయే ఆస్ట్రేలియా టూర్ దృష్ట్యా పేసర్లకు సహాయకారిగా ఉంచే పిచ్ వైపే జట్టు దృష్టి సారించింది. ఫలితంగా కివీస్‌తో మొదటి టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడొచ్చు. 2022లో ఇక్కడ జరిగిన చివరి టెస్టులోనూ పేసర్ల ఆధిపత్యం కనిపించింది. అప్పుడు శ్రీలంకపై బుమ్రా ఒక్కడే 8 వికెట్లు తీశాడు. పైగా పేసర్లు సిరాజ్, ఆకాశ్ ఆర్‌సీబీ ప్లేయర్లు కావడంతో చిన్నస్వామి వికెట్‌పై చక్కటి అవగాహనే ఉంటుంది. మంగళవారం వికెట్‌ను చూశాక జట్టు కూర్పుపై అంచనాకు వస్తామని గంభీర్ చెప్పాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు కివీస్ జట్టు లంక టూర్‌లో స్పిన్నర్లకు దాసోహమైంది. రెండు టెస్టుల్లో ఏకంగా 37 వికెట్లు వారికే కోల్పోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో స్పిన్నర్‌ను జట్టులోకి తెచ్చినా ఆశ్చర్యం లేదు.